పరిగి, జూలై 8 : ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి అనేక సందేహాలు ఓటర్ల మెదళ్లలో మెదలుతున్నాయి. అందుకనుగుణంగానే ఈ ప్రక్రియలో అనేక లోటుపాట్లు వెలుగుచూస్తున్నాయి. గత నెల 26 నుంచి ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలను అందించే ప్రక్రియ ప్రారంభమైంది. బూత్ లెవల్ ఆఫీసర్లు ఈ కార్యక్రమంలో ప్రధాన భూమిక పోషిస్తున్నారు. కాగా పరిగి పట్టణంలో ఓటర్ల అడ్రస్‌లు సైతం సరిగ్గా లభించక బీఎల్వోలు తలలు పట్టుకుంటున్నారు. ఏ అడ్రస్ ఎక్కడున్నదో తెలియని పరిస్థితి నెలకొన్నది.
లక్ష్యానికి దూరంగా ఫారాల పంపిణీ
పరిగి మున్సిపల్ పరిధిలో 27,772 మంది ఓటర్లున్నారు. వారిలో 7వ తేదీ మంగళవారం ఉదయం వరకు 21,600 మందికి ఎన్యుమరేషన్ ఫారాలు అందజేశారు. సుమారు 6వేల మందికి పైగా ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు అందించాల్సి ఉన్నది. ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీకి 28 బూత్‌ల పరిధుల్లో బీఎల్వోలను నియమించగా.. వారికి ప్రత్యేక శిక్షణ సైతం ఇచ్చారు. ఒక్కో బీఎల్వోకు సుమారు 990 మందికి పైగా ఓటర్లుండేలా ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ కనీసం 20 ఇళ్లకు వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు అందించి, వివరాలు సేకరించడంతోపాటు ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్దేశించారు. ఇక్కడివరకు అంతా బాగానే ఉన్నప్పటికీ.. పరిగి పట్టణం విస్తరించడం, కొత్తగా కాలనీలు ఏర్పడటంతోపాటు గతంలో ఇక్కడ ఓటర్లుగా ఉన్నవారు ఇతర ప్రాంతాలకు వెళ్లడం, ఇళ్లను మారడం వంటి కారణాలతో ఓటర్ల అడ్రస్ సరిగ్గా లభించక బీఎల్వోలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తద్వారా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియ ఆశించిన స్థాయిలో వేగంగా లేదని చెప్పవచ్చు.
మందకొడిగా ఆన్లైన్ ప్రక్రియ
ఎలక్షన్ కమిషన్ అందజేసిన ఎన్యుమరేషన్ ఫారాలలో సైతం తప్పులు ఉండటంతో ఇటు బీఎల్వోలు, అటు ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా గతంలో అద్దె ఇళ్లలో ఉన్నవారు సొంత ఇళ్ల నిర్మాణం చేపట్టి, అందులోకి మారగా ఎన్యుమరేషన్ ఫారాలలో పాత ఇళ్ల అడ్రస్‌లు ఉండటంతో బీఎల్వోలు ఫారాలు అందజేసేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తాము ఓటు వేసింది ఒక వార్డులో అయితే, తమ ఎన్యుమరేషన్ ఫారం మరో బూత్‌లో ఉండటమేంటని ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. కొన్ని ఎన్యుమరేషన్ ఫారాలలో ఫొటోలు ఒక వ్యక్తిది, పేరు మరో వ్యక్తిది ఉండటం గమనార్హం.
తద్వారా ఎన్యుమరేషన్ ఫారాలు పూర్తి చేసిన తర్వాత తమ ఫొటో పెడితే తమ ఓటు ఉంటుందో, రిజెక్ట్ చేస్తారా అనే సందేహాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఒకే కుటుంబంలో నలుగురు వ్యక్తులుంటే భర్త, కుమారుడిది ఓ బూత్ పరిధిలో.. భార్య, మరో కుమారుడిది మరో బూత్ పరిధిలో ఎన్యుమరేషన్ ఫారాలు రావడం విడ్డూరం. తమకు సంబంధం లేని బూత్ పరిధిలో తమ పేర్లు రావడమేంటని ప్రశ్నిస్తున్నారు. తాము ఏ బూత్ పరిధిలో వస్తామో తెలియని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిసార్లు సర్వర్ డౌన్ కారణంగా సైతం ఇబ్బందులు తలెత్తుతున్నాయని సిబ్బంది వాపోతున్నారు. తద్వారా ఆన్లైన్ ప్రక్రియ మందకొడిగా కొనసాగుతున్నదని పేర్కొంటున్నారు. తప్పుల తడక వివరాలతో ఇబ్బందులు తప్పడంలేదని వాపోతున్నారు.