కడ్తాల్, అక్టోబర్ 24ః మండల పరిధిలోని మైసిగండి గ్రామంలో గల రామాలయ, శివాలయాల్లో వెలసిన అన్నపూర్ణేశ్వరీదేవి అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ముగిశాయి. ఆలయంలో హోమాలు, పూర్ణాహుతి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. శరన్నవరాత్రుల చివరిరోజు అమ్మవారిని భక్తులు అధికసంఖ్యలో దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఆర్పీ జ్యోతి, ఈవో స్నేహలత, ఆలయ ట్రస్టు చైర్మన్ శిరోలీపంతూనాయక్, నాయకులు భాస్కర్‌నాయక్, అరుణ్‌కుమార్, రాఘవేందర్, అర్చక సిబ్బంది పాల్గొన్నారు.
ఘనంగా దుర్గామాత విగ్రహ నిమజ్జనోత్సవం
కడ్తాల్ మండల కేంద్రంలో దేవీశరన్నవరాత్రుల సందర్భంగా హనుమాన్ యువజన సంఘం ఆధ్వర్యంలో పాలశీతలీకరణ కేంద్రం ఆవరణలో ప్రతిష్ఠించిన దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. సోమవారం చివరి రోజు అమ్మవారు రాజరాజేశ్వరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. చీరను వేలం పాటలో గ్రామానికి చెందిన బాచిరెడ్డి అశోక్‌రెడ్డి రూ.50 వేలకు దక్కించుకున్నాడు. అనంతరం అమ్మ వారిని మండల కేంద్రంలోని ప్రధానవీధులగుండా ఊరేగించి, స్థానిక గుర్లకుంట చెరువులో నిమజ్జనం చేశారు. ఊరేగింపులో కళాకారుల నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
మైసమ్మతల్లి ఆలయంలో పూజలు
జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన మైసిగండి మైసమ్మతల్లి ఆలయంలో విజయదశమి పండుగ సందర్భంగా అమ్మ వారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మైసిగండి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ ఆయిళ్ల శ్రీనివాస్‌గౌడ్ కుటుంబ సభ్యులు అమ్మ వారికి క్షీరాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. మైసమ్మతల్లికి ఆయన నూతన వస్ర్తాలు సమర్పించారు. మైసమ్మ ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. కార్యక్రమంలో ఆల య వ్యవస్థాపక ధర్మకర్త శిరోలీపంతూనాయక్, ఈవో స్నేహలత, నిర్వాహకులు భాస్కర్‌నాయక్, అరుణ్‌నాయక్, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
యాచారం : మండలంలో విజయదశమి వేడుకలను సోమవారం ఘనంగా జరుపుకొన్నారు. హిందూ సంప్రదాయబద్ధంగా పిండివంటలు చేసుకుని, విందు, వినోదాలతో దసరా పండుగను తెగ ఎంజాయ్ చేశారు. ప్రజాప్రతినిధులు, పిల్లలు, పెద్దలు సాయంత్రం నూతన వస్ర్తాలు ధరించి పాలపిట్ట దర్శనం కోసం గ్రామస్తులంతా ఊరేగింపుగా వెళ్లారు. జమ్మిచెట్టు వద్ద పురోహితుల సమక్షంంలో పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామాల్లో ఆంజనేయస్వామి, బొడ్రాయి, గ్రామ దేవతలు, ఇతర దేవాలయాల్లో శమి పూజలు నిర్వహించారు. యాచారంలో రావణ దహణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. నందివనపర్తిలోని జ్ఞాన సరస్వతీ ఆలయంలో అమ్మవారు రాజరాజేశ్వరీ దేవిగా దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ఒకరికొకరు దసరా శుభాకాంక్షలు తెలుపుకొంటూ ఆలింగనం చేసుకున్నారు.
ఆమనగల్లు : విజయానికి ప్రతీక అయిన విజయ దశమి వేడుకలు ఆమనగల్లు మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలు ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దస రా వేడుకల్లో ప్రజా ప్రతినిధులు పాల్గొని పూజలు చేశారు. పట్టణంలో గాంధీ చౌక్ వద్ద శమి పూజ, ఆయుధ పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం బేతాళుడు, దుర్గాదేవి అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల స్థలం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రావణదహణం చేశారు.
తలకొండపల్లి : విజయదశమి పండుగను మండల ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. దుర్గామాత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
పెద్దఅంబర్‌పేట : మున్సిపాలిటీలోని కాలనీల్లో రావణ దహన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ప్రతి వీధిలోనూ శమీ పూజలు చేశారు. అంతా కలిసి దసరా వేడుకలు నిర్వహించారు. ఆలయాల్లో ప్రత్యేక అలంకరణలు చేసి ఆకట్టుకున్నారు. ఊరేగింపుగా వెళ్లి శమీ పూజలు చేసి.. ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఎమ్మెల్యేను కలిసిన బీఆర్ఎస్ శ్రేణులు
ఇబ్రహీంపట్నంరూరల్ : నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాలతో పాటు ఇబ్రహీంపట్నం, తుర్కయాంజాల్, ఆదిబట్ల, పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని మంగళవారం కలిశార. ఎలిమినేడులోని ఆయన వ్యవసాయక్షేత్రంలో కలిసి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దుర్గామాత అమ్మవారి కరుణ కటాక్షాలతో మరోసారి అధిక మెజార్టీతో గెలిచి రావాలని ఆకాంక్షించారు.