షాద్నగర్టౌన్, ఏప్రిల్ 03 : షాద్నగర్ మున్సిపాలిటీలో చేపట్టే అభివృద్ధి పనులతో మున్సిపాలిటీ మరింత సుందరంగా మారిందని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. ఇందులో భాగంగానే మున్సిపాలిటీలోని 22వ వార్డు భగత్సింగ్కాలనీలో ఆదివారం నూతన అంతర్గత మురుగుకాలువ పనులను కౌన్సిలర్ సరితతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. షాద్నగర్ మున్సిపాలిటీని ఆదర్శంగా తీరిదిద్దడమే లక్ష్యంగా వార్డుల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు.
ఇప్పటికే మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో సీసీరోడ్లు, అంతర్గత మురుగుకాలువ, ఇంటింటి నల్లాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పట్టణాభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. ఎక్కడ ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే కౌన్సిలర్, అధికారుల దృష్టికి తీసుకరావాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రతి మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ సర్కార్ ఎంతో కృషి చేస్తుందనే విషయాన్ని అందరూ గ్రహించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు యాదగిరి, భిక్షపతి, వెంకటేష్, నరేష్, రమేష్, బీరయ్య, సురేష్ పాల్గొన్నారు.