షాబాద్, జూన్ 9: విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల విద్యాశాఖ అధికారి లక్ష్మణ్ నాయక్ అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ బడులలో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి షాబాద్ మండలంలోని బొబ్బిలిగామ గ్రామంలో సోమవారం నిర్వహించిన ఇంటింటి సర్వేలో ఉపాధ్యాయులతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ.. ప్రభుత్వ బడులలో పాఠాలు బోధించే ఉపాధ్యాయులు ఉన్నత విద్యావంతులై, పోటీ పరీక్షలలో నెగ్గిన నిష్ణాతులైన వాళ్లే బోధిస్తారని, విద్యార్థుల చదువు విషయంలో ఉపాధ్యాయులు బాధ్యతగా ఉంటారని తెలిపారు. తమ పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులను ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లీష్ మీడియం బోధిస్తున్నారని, ఉచిత పుస్తకాలు, రెండు జతల యూనిఫాం, నాణ్యమైన మధ్యాహ్న భోజన వంటి సదుపాయాలతో ఎ-వన్ టెక్నాలజీతో కూడిన కంప్యూటర్ విద్యను కూడా ప్రభుత్వం పేద విద్యార్థులకు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి నాణ్యమైన విద్యను అందిస్తున్న ప్రభుత్వ బడులకు విద్యార్థులను పంపించాలని సూచించారు. అనంతరం ప్రైవేట్ పాఠశాలలకు వెళుతున్న 12 మంది విద్యార్థులను స్థానిక ప్రాథమిక పాఠశాలలో అడ్మిషన్ చేసినట్లు చెప్పారు.
హైతాబాద్ లో..
ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్ అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా సోమవారం షాబాద్ మండలంలోని హైతాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వసంత తో కలిసి బడిబాట ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను కచ్చితంగా ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని సూచించారు.