షాద్‌నగర్ టౌన్, జూన్16: ప్రభుత్వ నిబంధనలను పాటించని ప్రైవేట్ పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ విక్రయిస్తున్న నారాయణ, మేధా పాఠశాలలను సోమవారం తనిఖీ చేసి పాఠశాల ముందు నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, నోట్ బుక్స్, టై బెల్టులు విక్రయిస్తూ విద్యను వ్యాపారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పాఠశాలల్లోని విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్, నోట్ బుక్స్ వంటి వస్తువులను తప్పకుండా తమ వద్దనే కొనాలని పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు చెప్పడం సరికాదన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఆధునిక సౌకర్యాలు, నాణ్యమైన విద్యను అందిస్తామని చెబుతూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులను వసూలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ నిబంధనలను పాటించని ప్రైవేట్ పాఠశాలలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.