రంగారెడ్డి, జూలై 3 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని పలు పోలీస్స్టేషన్లలోని పోలీసులు సివిల్ తగాదాల్లో తలదూర్చుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా శివారు ఠాణాల పరిధిలో భూములు, ప్లాట్ల విలువలు గణనీయంగా పెరుగగా.. భూతగాదాలు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి. ఈ ఘర్షణలో తలెత్తుతున్న సమస్యలపట్ల పోలీసుల జోక్యం మితిమీరుతున్నదన్న ఆరోపణలున్నాయి.
ముఖ్యంగా శివారు ప్రాంతాల్లోని పోలీస్స్టేషన్లలోని సీఐలు అధికార పార్టీ నేతల కనుసన్నల్లో నడుస్తూ.. అమాయకులపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారన్న విమర్శలున్నాయి. దీంతో ఠాణాలను ఆశ్రయించినా తమకు న్యాయం జరగడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవుటర్‌రింగ్ రోడ్డు పరిధిలోని పలు ఠాణాల్లో భూకబ్జాదారులు పోలీసుల అండదండలతో అమాయకుల ప్లాట్లను కబ్జా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
ఓఆర్ఆర్ ప్రాంత ఠాణాల్లో..
జిల్లాలోని అవుటర్ రింగ్ రోడ్డు చుట్టు పక్కల ఉన్న హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, పహాడీషరీఫ్, బాలాపూర్, మీర్పేట్, వనస్థలిపురం, మహేశ్వరం, కందుకూరు, శంషాబాద్, యాచారం, మొయినాబాద్, శంకర్పల్లి, రాజేంద్రనగర్, అత్తాపూర్, నార్సింగి వంటి ఠాణాలకు ప్రతిరోజూ భూసంబంధిత సమస్యలపై దరఖాస్తులొస్తున్నా యి. అయితే, ఆ సమస్యలను సివిల్‌కోర్టులో పరిష్కరించుకోవాలని సూ చించాల్సిన పోలీసులు జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.
కోర్టులు ఆదేశించినా మారని తీరు..
ఇటీవల పలు భూసంబంధిత సమస్యలపై పోలీస్స్టేషన్లల్లో న్యాయం జరగని బాధితులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. కోర్టుల్లో పోలీసుల జోక్యాన్ని న్యాయమూర్తులు తప్పుబడుతున్నా వారి తీరులో మాత్రం మార్పు రావడం లేదు. అదేవిధంగా తమ చర్యలను కొనసాగుతున్నారు.
కొరడా ఝులిపిస్తున్న ఉన్నతాధికారులు..
ఇటీవల రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధుల్లో పలువురు పోలీస్ అధికారులు సివిల్ తగాదాల్లో జోక్యం చేసుకుంటుండడంతో ఉన్నతాధికారులు గుర్తించి వారిపై కొరడా ఝులిపిస్తున్నా మార్పు మాత్రం రావడంలేదనే ఆరోపణలున్నాయి.. ఇబ్రహీంపట్నం ఠాణాలో పలువురు ఎస్‌హెచ్‌వోలు సివిల్ తగాదాల్లో జోక్యం చేసుకున్నారన్న ఆరోపణతో ఆరు నెలల్లో ముగ్గురు అధికారులను బదిలీ చేశారు. అలాగే, హయత్‌నగర్ ఠాణా పరిధిలో మరో భూతగాదాలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని అక్కడి అధికారిపై వేటు వేశారు. అలాగే, వనస్థలిపురం ఠాణా పరిధిలోనూ భూవివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకున్నారన్న ఆరోపణలున్నాయి.
తుర్కయాంజాల్‌లో ఓ భూవివాదం, మాడ్గుల ఠాణా పరిధిలోని మరో వివాదంలో పోలీసులు సరైన తీరులో స్పందించలేదని రెవెన్యూ అధికారులు 145 సెక్షన్ విధించి ఆ భూములపై నిషేధిత ఆజ్ఞలు విధించారు. అలాగే, బాలాపూర్ ఠాణా పరిధిలోని మల్లాపూర్‌లో దళితుల భూములను కబ్జాచేశారని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అలాగే, కందుకూరు, పహాడీషరీఫ్ తదితర ఠాణాల పరిధిల్లోనూ భూకబ్జాదారులకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలున్నా యి. సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యంతో తమకు న్యాయం జరగడం లేదని పలువురు బాధితులు కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తున్నారు. సివిల్ తగాదాల్లో వారి జోక్యాన్ని అరికట్టాలని ఉన్నతాధికారులను కోరుతున్నారు.
అధికార పార్టీ నేతల మెప్పుకోసం..
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్న ఠాణాల్లో తలెత్తుతున్న భూ సమస్యల విషయంలో అధికార పార్టీ నేతలు మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారు. వారి నుంచి ఫోన్లు రాగానే.. పోలీసులు న్యాయ విచారణ జరుపకుండానే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఇటీవల జరిగిన బదిలీల్లో అధికార పార్టీ నాయకులు తమకు అనుకూలంగా ఉన్న ఎస్హెచ్వోలకే పోస్టింగ్‌లు ఇప్పించుకున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో పోలీసులు కూడా తమకు పోస్టింగ్ ఇప్పించిన వారి కనుసన్నల్లోనే పనిచేస్తున్నట్లు సర్వత్రా విమర్శలొస్తున్నాయి.