రంగారెడ్డి, జూలై 2 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లాలో రెండో విడుత చేపట్టిన ‘కంటి వెలుగు’ కార్యక్రమం అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధుల సమష్టి కృషితో విజయవంతమైంది. జనవరి 19న ప్రారంభమైన ఈ కార్యక్రమం 100 రోజులకుపైగా కొనసాగింది. ప్రజల నుంచి విశేష స్పందన రాగా.. శిబిరాలను సబ్బండ వర్గాలు సద్వినియోగం చేసుకున్నాయి. జిల్లావ్యాప్తంగా 12 మున్సిపాలిటీలు, మూడు నగరపాలక సంస్థలు, 794 గ్రామపంచాయతీలలో 80 వైద్య బృందాల ఆధ్వర్యంలో 8,071 కంటి వెలుగు శిబిరాలను నిర్విఘ్నంగా నిర్వహించారు. 8,34,442 మందికి కంటి పరీక్షలు చేయగా.. అందులో 1,94,059 మందికి కంటి చూపు సమస్య ఉన్నట్లు గుర్తించారు. 1,02,107 మందికి రీడింగ్ గ్లాసెస్, 91,952 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలను అందజేశారు. ఎటువంటి ఖర్చు లేకుండా కంటి పరీక్షలు చేయడంతోపాటు అద్దాలు పంపిణీ చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
‘అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటివెలుగు రెండో విడుత కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో విజయవంతమైనది. కంటి సమస్యలతో సతమతమవుతున్న ఎంతోమందికి ప్రభుత్వమే ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి వెలుగునిచ్చింది. 12 మున్సిపాలిటీలు, మూడు నగరపాలక సంస్థలు, 794 గ్రామ పంచాయతీల్లో 80 వైద్య బృందాల ఆధ్వర్యంలో 8,071 శిబిరాలను తెలంగాణ ప్రభుత్వం నిర్విఘ్నంగా నిర్వహించింది. ప్రజల నుంచి విశేష స్పందన రాగా.. శిబిరాలను సబ్బండ వర్గా లు సద్వినియోగం చేసుకున్నాయి. మొత్తం 8,34,442 మందికి కంటి పరీక్షలు నిర్వహించడంతోపాటు 1,02,107 మందికి రీడింగ్ అద్దాలను, 91,952 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలను అందజేసింది.’
అన్నీ ఉచితంగా..
సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు పెద్దలు. మనిషికి ఉన్న అన్ని అంగాల్లో కండ్లు ప్రధానమైనవి. పేదరిక పరిస్థితుల్లో కంటి సమస్యలను పరిష్కరించుకోలేక పోయిన వారికి తెలంగాణ ప్రభుత్వం దృష్టిని ప్రసాదించింది. 2018 ఆగస్టులో మొదటి విడుత ‘కంటి వెలుగు’ కార్యక్రమం జిల్లాలో విజయవంతం కాగా.. ఈ ఏడాది జనవరి 19న ప్రారంభమైన రెండో విడుతలోనూ ప్రభు త్వం శిబిరాలు నిర్వహించి ప్రజల ఆకాంక్షను నెరవేర్చింది. ఉచితంగా పరీక్షలు చేయడమే కాకుండా.. కండ్లద్దాలను, మందులను అందజేసింది. నిర్విఘ్నంగా సాగిన ఈ కార్యక్రమంతో అనేక మంది నిరుపేదలు, వృద్ధుల జీవితాల్లో ప్రభుత్వం వెలుగులను నింపింది. రోజువారీ విధు లు నిర్వర్తిస్తూనే కంటి వెలుగు శిబిరాలను కొనసాగించి వైద్య సిబ్బంది, అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమించారు. జిల్లా కలెక్టర్, డీఎంహెచ్వో, ఇతర అధికారుల పర్యవేక్షణలో దిగ్విజయంగా పరీక్షలు, అద్దాల పంపిణీ ప్రక్రియలు పూర్తయ్యాయి. జిల్లావ్యాప్తంగా 18 ఏండ్లు నిండిన ప్రతి వ్యక్తికీ నేత్ర పరీక్షలు చేయాలని ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యం జిల్లాలో సంపూర్ణమైంది.
తొలగిన కంటి సమస్యలు
కంటి చూపు సమస్య అనేక మందిని వేధిస్తున్నప్పటికీ ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి వేల రూపాయలు ఖర్చుపెట్టే స్థోమత లేక చాలా మంది వెనుకంజ వేశారు. అయితే ప్రభుత్వమే ఊరూరా.. వాడ వాడల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంతో ప్రజలు సద్వినియోగపర్చుకున్నారు. జిల్లా మంత్రితోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు సైతం ఇందులో భాగస్వామ్యులై ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించారు. ప్రిస్క్రిప్షన్ అద్దాలకు క్లినికుల్లో రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు ఖర్చు చేయాల్సి వచ్చేది. అయితే ప్రభుత్వం రూపాయి ఖర్చు లేకుండా కంటి పరీక్షలతోపాటు అద్దాలు, కావాల్సిన మందులను పూర్తి ఉచితంగా అందజేసింది. ప్రభుత్వం నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమంలో కంటి చూపు సమస్యలు తొలగిపోవడంతో ప్రజానీకం సంతోషం వ్యక్తం చేస్తున్నది.
నేత్ర సమస్యల నివారణపై అవగాహన కల్పిస్తూ.. స్క్రీనింగ్ పరీక్షలు
జిల్లాలోని 794 గ్రామ పంచాయతీలు, 12 మున్సిపాలిటీలు, మూడు నగర పాలక సంస్థల్లో కంటి వెలుగు కార్యక్రమం నిరంతరాయంగా సాగింది. జిల్లా జనాభా 27,66,79 కాగా.. కంటి పరీక్షల కోసం ప్రభుత్వం 80 వైద్య బృందాలను ఏర్పాటు చేసింది. ప్రతి శిబిరంలో వైద్యాధికారితోపాటు నేత్ర వైద్యుడు, సిబ్బంది కలిసి ఎనిమిది మంది ఉండగా.. వీరు నేత్ర సమస్యల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 8,34,442 మందికి పరీక్షలు నిర్వహించి 1,02,107 మందికి రీడింగ్ గ్లాసెస్ అవసరమని నిర్ధారించారు. ఈ మేరకు ఇప్పటికే 1,02,068 మందికి అక్కడికక్కడే అద్దాలను అందజేశారు. అలాగే మరో 91,952 మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ అవసరమని గుర్తించి ఇప్పటివరకు 65,057 మందికి కండ్లద్దాలను అందజేశారు. మిగిలిన వారికీ అద్దాలను అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
సమష్టి కృషితోనే..
ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతం చేశాం. కంటి పరీక్షలు నిర్వహించిన వారిలో 90 శాతం మందికి పైగా అద్దాలను పంపిణీ చేశాం. మిగిలిన వారికి త్వరలోనే అందజేస్తాం. అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధుల సమష్టి కృషితోనే కార్యక్రమం విజయవంతమైంది.
– వెంకటేశ్వరరావు, డీఎంహెచ్వో, రంగారెడ్డి జిల్లా