రంగారెడ్డి, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఇంటికొక్కరు చొ ప్పున రోగాలబారిన పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో జిల్లాలో వాతా వరణంలో వచ్చిన మార్పులతో వందల సంఖ్యలో ప్రజలు వ్యాధులతో ఇబ్బందిపడుతున్నా రు. గ్రామీణ, పట్టణ ప్రాం తాల్లో ఎక్కడచూసినా విషజ్వరాలు పెరిగిపోతుండడం తో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు లేకపోవటం..మందుల కొరత తీవ్రంగా ఉండటంతో రోగులు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు నియోజకవర్గస్థాయిలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్లనూ డాక్టర్ల కొరత వేధిస్తున్నది. ఉదయం మాత్రమే ఓపీ కేసులను చూసి డాక్టర్లు వెళ్లిపోతున్నారు. సాయంత్రం సమయంలో ఉండకపోవడంతో రోగులకు సరైన వైద్యం అందడంలేదు. జిల్లాలో 83 బస్తీ దవాఖానలు, 30 పీహెచ్సీలు, 11 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లున్నాయి. వీటిలో డాక్టర్లు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉండటంతో ప్రభుత్వ దవాఖానల్లో వైద్యం పేదలకు సరిగ్గా అందటం లేదన్న ఆరోపణలున్నా యి. మరోవైపు ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ప్రభుత్వ ఆస్పత్రులకు డాక్టర్లు ఎప్పుడు వస్తున్నారో.. ఎప్పుడు వెళ్తున్నారో తెలియని పరిస్థితి నెలకొన్నది.
గత కేసీఆర్ ప్రభుత్వం మున్సిపాలిటీల్లో ఉంటున్న పేదలకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు జిల్లాలో 83 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసింది. ఒక్కో మున్సిపాలిటీలో రెండు నుంచి మూడు చొప్పున ఏర్పాటు చేశారు. ఒక్కో దవాఖానకు ఔట్సోర్సింగ్ విధానంలో డాక్టర్లను నియమించారు. కానీ, ఈ డాక్టర్లు చాలామంది విధులను మానేశారు. జిల్లాలో 16 బస్తీ దవాఖానలు ప్రస్తుతం డాక్టర్లు లేకుండానే కొనసాగుతున్నాయి. ఈ ఆస్పత్రుల్లో కిందిస్థాయి సిబ్బంది, నర్సులే రోగులకు మందులిచ్చి పంపిస్తున్నారు. అలాగే, జిల్లాలో 30 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుండగా..వీటిని మండలానికి రెండు నుం చి మూడు చొప్పున ఏర్పాటు చేయగా.. ఇందులోనూ ఎనిమిది దవాఖానలకు డాక్టర్లు లేకుండానే కొనసాగుతున్నాయి.
జిల్లాలోని బస్తీ దవాఖానల్లో ఉన్న డాక్టర్ పోస్టుల ఖాళీలను త్వరలో భర్తీ చేస్తాం. ఇప్పటికే ఆ వివరాలను కలెక్టర్కు పం పించా. వాటి భర్తీ కోసం త్వరలోనే నోటిఫికేషన్ జారీ కానున్నది. అలాగే, పీహెచ్సీల్లో ఖాళీగా ఉన్న పోస్టులనూ భర్తీచేసేందుకు ఉన్నతాధికారులకు నివేదికను పంపించా.
ఇబ్రహీంపట్నం, షాద్నగర్, చేవెళ్ల, రాజేంద్రనగర్, హయత్నగర్, యాచారం మండలాల్లో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను గతంలో ప్రభుత్వం వైద్యవిధాన పరిషత్లో విలీనం చేసింది. అందులో విలీనం కావడంతో ఆ దవాఖానల నిర్వహ ణ అస్తవ్యస్తంగా మారింది. ఈ ఆస్పత్రులకు ప్రతిరోజూ వందల సంఖ్యలో ఔట్పేషెంట్లు వస్తుంటారు. డాక్టర్ల కొరతతో మెరుగైన వైద్యం అందడంలేదన్న ఆరోపణలున్నాయి.