బొంరాస్‌పేట, జూన్ 11 : నేటి నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నది. వేసవి సెలవుల అనంతరం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు బుధవారం నుంచి తెరుచుకోనున్నాయి. సర్కారు బడుల్లో విద్యార్థులను చేర్పించడానికి విద్యాశాఖ ఈ నెల 6వ తేదీ నుంచి బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఉపాధ్యాయులు గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి బడీడు పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న వసతి, సౌకర్యాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ పిల్లలను సర్కారు బడుల్లోనే చేర్పించాలని కోరుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాలల నిర్వహణకు మహిళా సంఘాలతో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేసింది. వీటిద్వారానే పాఠశాలల్లో తాగునీరు, విద్యుత్ సౌకర్యం, చిన్న చిన్న మరమ్మతుల వంటి పనులు పూర్తి చేసి వసతి సౌకర్యాలను కల్పిస్తున్నది. ఇవన్నీ బాగానే ఉన్నా సర్కారు బడుల్లో విద్యార్థులను ఉపాధ్యాయుల కొరత వేధిస్తున్నది.
జిల్లాలో 1038 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా అనేక పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చాలా పాఠశాలల్లో సింగిల్ టీచర్లు పని చేస్తున్నారు. వీరు ఏ కారణం చేతనైనా సెలవు పెడితే ఆ పాఠశాల మూతపడాల్సిందే. ఖాళీ పోస్టుల స్థానంలో విద్యా వలంటీర్లను నియమించే పరిస్థితి లేకపోవడంతో టీచర్ల కొరతతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందే పరిస్థితి లేదు. అదేవిధంగా ఫిజికల్ సైన్స్ టీచర్లు 6, 7 తరగతులకు గణితం బోధించాలని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను చాలా మంది ఫిజికల్ సైన్స్ టీచర్లు వ్యతిరేకిస్తున్నారు. గణితం బోధించడానికి వారు నిరాకరిస్తున్నారు. ప్రభుత్వం డీఎస్సీ ద్వారా ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించినా దానికి కనీసం ఐదారు నెలలు పడుతుంది. అప్పటి వరకు సగం విద్యా సంవత్సరం ముగుస్తుంది. పాఠశాలల్లో టీచర్ల కొరత ఉండడం వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు బాట పట్టిస్తున్నారు. పాఠశాలల పునఃప్రారంభానికి ముందే పూర్తి చేయాల్సిన టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను ఇప్పుడు చేపట్టడం వల్ల పాఠశాలల నిర్వహణ గందరగోళంగా మారే అవకాశం ఉన్నది.
ముందే యూనిఫాం, పాఠ్య పుస్తకాలు..
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా అందజేసే పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫాం మండలాలకు ముందే చేరుకున్నాయి. ఎంఆర్సీ కేంద్రాల నుంచి పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలను పంపిణీ చేస్తున్నారు. విద్యార్థులకు అందజేసే రెండు జతల యూనిఫాంను కుట్టే బాధ్యతను ప్రభుత్వం ఈ ఏడాది మహిళా సంఘాలకు అప్పగించింది. ఒక జతకు సరిపోయే వస్త్రం రావడంతో దానిని ఎంపిక చేసిన మహిళా సంఘాలకు ఇవ్వగా వారు యూనిఫాంను కుట్టి పాఠశాలలకు అందజేస్తున్నారు. పాఠశాలలు తెరిచిన రోజే విద్యార్థులకు వీటిని అందజేయడానికి చర్యలు తీసుకుంటున్నారు.
పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు..
ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది నుంచి మహిళా సంఘాలతో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేసింది. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేసి ఈ కమిటీల ద్వారానే పనులు చేయిస్తున్నది. తాగునీరు, విద్యుత్‌తో పాటు మరమ్మతు పనులకు ప్రాధాన్యం ఇచ్చి పనులు చేయిస్తున్నారు. ఈ పనులు కొన్ని పాఠశాలల్లో పూర్తి కాగా, మరికొన్ని పాఠశాలల్లో కొనసాగుతున్నాయి. పాఠశాలలకు రంగులు వేస్తున్నారు. విద్యార్థులు కూర్చోవడానికి డ్యూయెల్ డెస్క్ బెంచీలు, గ్రీన్ చాక్ బోర్డులు ప్రభుత్వం సరఫరా చేసింది.