ఇబ్రహీంపట్నం, జూన్ 16 : తమ పిల్లలు ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో చదివితే భవిష్యత్ బాగుంటుందనే ఆలోచనతో తల్లిదండ్రులు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలను ఆశ్రయిస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ విద్యాసంస్థల నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా ఫీజులు వసూళ్లు చేస్తున్నారు. ఒకటి నుంచి పదోతరగతి వరకు రూ. 40,000 నుంచి రూ. 80,000 వరకు దండుకుంటున్నారనే ఆరో పణలున్నాయి.
సర్కారు పాఠశాలల్లోనే పిల్లలను చదివించాలంటూ ఓ వైపు ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా.. మరోవైపు కొత్త సిలబస్, ఫౌండేషన్ కో ర్సులు అంటూ ఆకర్షణీయమైన కరపత్రాలు ముద్రించి ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు ప్రచారం చేస్తున్నాయి. ప్రైవేట్‌లో తమ పిల్లలను చేర్పిస్తున్న పేద, మధ్యతరగతి వారికి అధిక ఫీజులు చెల్లించడం భారంగా మారిందని పలువురు వాపోతున్నారు.
అన్నీ తమ వద్దే కొనాలని..
నోట్ పుస్తకాల దగ్గర నుంచి యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు, షూ, బెల్టు, పెన్ను, పెన్సిల్, వాటర్‌బాటిళ్లు ఇతరత్రా అన్ని రకాల సామగ్రిని తమ పాఠశాలల్లోనే కొనాలని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పిల్లల తల్లిదండ్రులను ఒత్తిడి చేస్తున్నాయి. దీంతో చిన్నపా టి ఉద్యోగం చేసుకునే వారికి బడి ఫీజులు చె ల్లించడం భారంగా మారింది. దీంతో కొంతమంది అప్పులు చేసి మరీ చదివిస్తున్నారు.
ఇరుకు గదుల్లోనే..
విద్యార్థులు చదువుకునే పాఠశాల గదుల్లో వెలుతురు, గాలితోపాటు శుభ్రత ఉండాలి. జిల్లాలో చాలావరకు ప్రైవేట్ పాఠశాలలు ఇరుకు గదుల్లోనే కొనసాగుతున్నాయి. వెలుతురు లేకపోగా ఫ్యాన్లు కూడా సక్రమంగా లేని పరిస్థితి నెలకొన్నది. కొందరు శివారు ప్రాంతాల్లో ఏర్పాటు చేయగా, మరికొందరు పట్టణం మధ్యలోనే ప్రైవేట్ భవనాలను అద్దె కు తీసుకుని స్కూళ్లను కొనసాగిస్తున్నారు. ఫైర్‌సేప్టీ, ప్లేగ్రౌండ్స్ ఇతర వసతులు ఏమీ ఉండకున్నా విద్యాశాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇబ్రహీంపట్నం, తుర్కయాంజాల్, యాచారం, మంచాల, అబ్దుల్లాపూర్‌మెట్, ఆదిబట్ల, పెద్దఅంబర్పేట్తో పాటు పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రైవేట్ పాఠశాలలు ఎలాంటి వస తులు లేని గదుల్లో కొనసాగుతున్నాయి.
ప్రైవేట్ స్కూళ్లపై చర్యలు తీసుకోవాలి
పేద విద్యార్థుల వద్ద అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై నిఘా పెంచాలి. పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, యూనిఫామ్, షూ, టై, బెల్టులతోపాటు విద్యార్థులకు అవసరమైన సామగ్రిని విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి.
-రాజ్‌కుమార్, బీఆర్ఎస్వీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి
ఫీజులను నియంత్రించాలి
ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు యూనిఫామ్స్, బుక్స్, ఐడీకార్డుల పేరుతో విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేస్తున్నాయి. అధికారులు స్పందించి అధిక ఫీజులను నియంత్రించాలి.
-మైలారం విజయ్‌కుమార్, విద్యార్థి సంఘాల నాయకుడు