దాదాపు 45 రోజుల వేసవి సెలవుల అనంతరం తెలంగాణలో పాఠశాలలు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో స్కూల్ బస్సుల ఫిట్‌నెస్‌పై రవాణా శాఖ అధికారులు ఫోకస్ చేశారు. నిబంధనలు పాటించని, ఫిట్‌నెస్‌లేని, సరైన పత్రాలు లేని బస్సులను సీజ్ చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ వంటి ప్రధాన నగరాలు, జిల్లాలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
రాజేంద్రనగర్, ఆరాంఘర్, అప్పా జంక్షన్, శంషాబాద్, షాద్‌నగర్, చేవెళ్ల, మియాపూర్ తదితర ప్రాంతాల్లోని స్కూల్ బస్సులను ఆర్టీఏ అధికారులు గురువారం ఉదయం తనిఖీలు చేశారు. విద్యార్థులను తరలించే పాఠశాల బస్సులను రవాణా శాఖ అధికారులు తనిఖీ చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా పరిశీలించారు. బస్సు ఆర్సీ, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్‌లతో పాటు ఫిట్నెస్, ఇన్సూరెన్స్ వంటివి ఉన్నాయా? లేదా? అనేవి చెక్ చేశారు. ముఖ్యంగా హ్యాండ్ బ్రేక్, ఫైర్ ఎక్సిటింగిషర్, మెడికల్ కిట్లను కూడా పరిశీలించారు.