ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద లబ్ధిదారుల ఎంపికపై ప్రజల్లో అయోమయ పరిస్థితి నెలకొన్నది. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ నత్తనడకన కొనసాగుతున్నది. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల్లో 83 శాతం దరఖాస్తుల పరిశీలనే పూర్తైంది. ఇదే అదనుగా భావించిన కొందరు కేటుగాళ్లు ఇండ్లు ఇప్పిస్తామంటూ పైసల వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇటీవల ధారూరు మండలంలో ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.10 వేల చొప్పున ముగ్గురి వద్ద వసూలు చేసుకుని ఉడాయించారు.
సీఎం నియోజకవర్గం కొడంగల్‌కు చెందిన వాడినని, లబ్ధిదారుల ఎంపిక జాబితాలో పేరు వచ్చేలా చూస్తానని అమాయకులను బురిడి కొట్టించాడు. పల్లె ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్లే మోసపోతున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇల్లు ఇప్పిస్తాం.. రూ.5 లక్షల ఆర్థిక సాయం కావాలంటే కొంతమేర డబ్బులు ఇవ్వాల్సిందే’నని కొందరు అధికార పార్టీ నేతలు బేరసారాలకూ దిగుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఇందిరమ్మ కమిటీల్లోని సభ్యులు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే కావడంతో ఈ వసూళ్ల దందాకు తెరలేపినట్లు ఊరూరా చర్చ జరుగుతున్నది.
– వికారాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ)
ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి డిసెంబర్ చివరిలోగా దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉండగా సాంకేతిక సమస్యలతో ఇంకా కొనసాగుతున్నది. ప్రారంభంలో దరఖాస్తుదారుడికి సంబంధించిన దాదాపు 30 ప్రశ్నల వివరాలను యాప్ ద్వారా వేగంగా సేకరించి ఆన్లైన్లో పొందుపరిచారు. కానీ నెట్వర్క్ సమస్యతోపాటు మరోవైపు యాప్ అప్డేట్ చేయడంతో దరఖాస్తుదారుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడం ఆలస్యమవుతున్నది. ఒక్కో దరఖాస్తుదారుడి వివరాలను 30 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉండగా సాంకేతిక సమస్యలతో గంటకుపైగా పడుతున్నది. సంబంధిత యాప్‌ను ఇప్పటివరకు మూడు సార్లు అప్డేట్ చేయడం వల్ల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వెనుకబడింది. జిల్లావ్యాప్తంగా 2,57,654 మంది ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకోగా, ఇప్పటివరకు 83 శాతం మాత్రమే పరిశీలన ప్రక్రియ పూర్తైంది.జిల్లాలో 2.13 లక్షల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తికాగా, మరో 44,654 దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉన్నది. అయితే రెండు, మూడు రోజుల్లో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తవుతుందని సంబంధిత అధికారులు చెబుతున్నప్పటికీ మరో వారం రోజులకుపైగా పట్టే అవకాశం ఉన్నది.