Green field Route | రంగారెడ్డి, జనవరి 11 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ఫ్యూచర్‌సిటీ కోసం ఏర్పాటు చేస్తున్న గ్రీన్‌ఫీల్డ్ రోడ్డును శాటిలైట్ ఇమేజ్ ద్వారా అధికారులు తయారు చేశారు. పలుచోట్ల డ్రోన్ కెమెరాలను ఉపయోగించి హద్దులను సైతం నిర్ణయించారు. గ్రీన్‌ఫీల్డ్ రోడ్డులో విలువైన రైతుల పంటపొలాలు పోయే ప్రమాదం ఉన్నది. శాటిలైట్‌పై ఆధారపడి రోడ్డును తయారు చేయడం వల్ల యాచారం, కడ్తాల్, ఆమనగల్లు, ముద్విన్ వంటి మండలాల్లో భూములు కోల్పోయి రైతులు నష్టపోవాల్సి వస్తున్నది.
ఓఆర్ఆర్ కొంగరకలాన్ నుంచి తిమ్మాపూర్, లేమూర్ మీదుగా పంజాగూడ వరకు ఒక రోడ్డును, అలాగే, ఆకుతోటపల్లి నుంచి ముద్విన్, ఆమనగల్లు, కడ్తాల్, యాచారం మండలాల మీదుగా పంజాగూడ వరకు రెండు వైపులా రోడ్డు వేస్తున్నారు. దీంతో రైతులు సుమారు వెయ్యి ఎకరాలను కోల్పోవాల్సి వస్తున్నది. తమ భూములివ్వబోమని రైతులు తెగేసి చెబుతున్నప్పటికీ పోలీసు బందోబస్తు మధ్య సర్వే చేసి, అధికారులు చాటుమాటుగా హద్దురాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. తమ భూములు లాక్కుంటే బతికేదెలా అని రైతులు వాపోతున్నారు.
వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నామని, గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుకు తమ భూములను బలవంతంగా లాక్కోవడం సరికాదని రైతులు ఆందోళన చేస్తున్నా.. ప్రభుత్వానికి రైతుల గోడు వినిపించడం లేదు. 4 నుంచి 5 బృందాలుగా సర్వే అధికారులు విడిపోయి ఆయా గ్రామాల్లో హద్దురాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. సాగుకు యోగ్యం కాని పొలాల నుంచి రోడ్లను వేయాల్సి ఉన్నప్పటికీ కేవలం శాటిలైట్‌ను నమ్ముకుని రోడ్డును గుర్తిస్తుండడం దారుణమని రైతులు లబోదిబోమంటున్నారు. సాకిబండాతండా, కడ్తాల్ మండలంలోని ఎక్వాయిపల్లి, యాచారం మండలంలోని కుర్మిద్ద సమీపంలోని మంగలిగడ్డతండాలో సర్వే నిర్వహించడానికొచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్నారు. రైతులు ఇండ్లకు వెళ్లిన తర్వాత హద్దురాళ్లను ఏర్పాటు చేస్తున్నారు.
కందుకూరు, యాచారం, ఆమనగల్లు మండలాల్లో కొంత కాలంగా డ్రోన్ల కలకలం చర్చనీయాంశంగా మారింది. రాత్రి, పగలు డ్రోన్లు ఎందుకు తిరుగుతున్నాయని ప్రజలకు అర్థం కాలేదు. ఈ డ్రోన్ల కలకలం గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు కోసమే వినియోగిస్తున్నారని ప్రచారం జరుగుతున్నది. హెచ్ఎండీఏ అధికారులు ఇటీవల పంజాగూడ సమీపంలో ఫార్మా బాధిత రైతుల కోసం ఏర్పాటు చేసిన కాలనీలో కూడా డ్రోన్లను వినియోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. డ్రోన్ కెమెరాల ద్వారా సమాచారం తెప్పించుకుని గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్దారించినట్లు ప్రచారం జరుగుతున్నది.