యాచారం, జూలై 13 : ఫార్మా బాధిత రైతుల సమస్యలు పరిష్కరించే వరకూ పోరాడుతామని ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ సమన్వయకర్త సరస్వతి స్పష్టం చేశారు. ఆదివారం ఆమె మండలంలోని మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాలకు చెందిన ఫార్మా బాధిత రైతులతో సమావేశమయ్యారు. రానున్న రోజుల్లో తమ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వంపై అనుసరించాల్సిన వ్యూహాలపై అందులో చర్చించారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకూ ఐక్యంగా పోరాడాలని ప్రతినబూనారు.
ఈ సందర్భంగా సరస్వతి మాట్లాడుతూ.. అధికారంలోకి రాగానే ఫార్మాసిటీని రద్దు చేస్తామని, రైతుల భూములను తిరిగి వారికే ఇస్తామని చెప్పి రైతులతో కలిసి పాదయాత్ర చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీలు కోదండరాం, తీన్మార్ మల్లన్న, కోదండరెడ్డి తమకు పదవులు రాగానే ఫార్మా బాధిత రైతులను పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. రైతులను మోసం చేసిన కాంగ్రెస్ నేతలను మరోసారి కలిసి వారి హామీలపై నిలదీస్తామని ఆమె పేర్కొన్నారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఫార్మాసిటీని రద్దు చేయడంతోపాటు ఫార్మాకు ఇవ్వని భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఫార్మాసిటీ ప్లాట్ల పంపిణీలోనూ బాధిత రైతులను అధికారులు మోసం చేశారని ఆరోపించారు. ఫార్మాకు పట్టా భూములివ్వని రైతులకు కూడా అసైన్డ్ ప్లాట్లను అందజేసిన అధికారులు.. వారితో ఒప్పంద పత్రాలపై మోసపూరితంగా సంతకాలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ అంశంపై సోమవారం కలెక్టర్ నారాయణరెడ్డి, ఇబ్రహీంపట్నం ఆర్డీవోలను కలిసి వినతిపత్రాలను అందిస్తామన్నారు. ప్రభుత్వం ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా 2500 ఎకరాల భూమిని ప్రభుత్వానికి ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
ప్రజాప్రతినిధులు, అధికారులు రైతులకిచ్చిన మాటను నిలబెట్టుకోవాలని.. అందుకు వారు నిషేధిత జాబితా నుంచి రైతుల పేర్లను తొలగించడంతోపాటు ఆన్లైన్లో రైతుల పేర్లను నమోదు చేయించాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా, పంట రుణాలు, భూములను అమ్ముకునేందుకు రైతులకు హక్కులు కల్పించాలని ఆమె పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు గణేశ్, నారాయణ, నిరంజన్, మహిపాల్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, సందీప్‌రెడ్డి, చెన్నయ్య, పాపిరెడ్డి, గణేశ్, సత్యం పాల్గొన్నారు.