మియాపూర్ , మే 30 : తాను బాధ్యతగా ఉండటమే కాదు.. పది మంది ఆచరించేలా చేశారు ఆ కాలనీ వాసి. చెత్తకుప్పలు లేని కాలనీలే లక్ష్యమనే బల్దియా నినాదాన్ని తూచా తప్పకుండా పాటించి.. ప్రజలను చైతన్యవంతులను చేసి..చక్కటి ఫలితాన్ని సాధించారు. పరిమిత సంఖ్యలో నివాసాలుండే ఆ కాలనీలో ఏండ్ల తరబడి సమస్యగా మారిన వ్యర్థాల కుప్పలను శాశ్వతంగా నిర్మూలించగలిగారు. శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని కొండాపూర్ డివిజన్ గఫూర్ కాలనీ సంక్షేమ సంఘానికి చెందిన సభ్యుడు రాజు చిరు వ్యాపారి. 100కు పైగా గడపలున్న ఆ కాలనీలో సుమారు 1200 మంది వరకు ప్రజలు నివసిస్తున్నారు. అయితే కాలనీలో కొన్నేండ్లుగా మూడు ప్రాంతాల్లో నిత్యం చెత్త ఇతర వ్యర్థాలు పోగయ్యేవి. ఇటీవల వాటిని పూర్తి స్థాయిలో నిర్మూలించే లక్ష్యంతో జడ్సీ స్నేహ శబరీశ్ అధికారులతో కలిసి నిత్యం క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ..ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.
శేరిలింగంపల్లి సర్కిల్ డీసీ రజనీకాంత్‌రెడ్డి, వైద్యాధికారి డాక్టర్ నగేశ్, శానిటరీ ఇన్స్పెక్టర్ జలంధర్‌రెడ్డితో పాటు ఎస్ఆర్పీ, ఎస్ఎఫ్ఏ, పారిశుధ్య సిబ్బంది చెత్త పేరుకునే ప్రాంతాల నిర్మూలనపై పలు దఫాలుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కాలనీ సంక్షేమ సంఘం సభ్యులుగా రాజు.. ప్రతి అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. తన వంతుగా బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయవద్దని కాలనీవాసులకు అవగాహన కల్పించారు. వందకు పైగా ఇండ్లకు తిరిగి.. ప్రజలను చైతన్యవంతులను చేయడంలో ఆయన సఫలమయ్యారు. చివరికి కాలనీలోని చెత్త కుప్పల ప్రాంతాలను వ్యర్థరహితంగా మార్చగలిగారు. రాజు కృషి ఫలితంగా.. ప్రసుత్తం గఫూర్‌నగర్‌లో ఒక్క చెత్త కుప్ప కూడా కనిపించడం లేదు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ ఆటోలకు వ్యర్థాలను అందిస్తూ.. ఇతర కాలనీలకు ఆదర్శంగా నిలిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం రాజు పుట్టినరోజు కావడంతో పారిశుధ్య సిబ్బంది.. వ్యర్థాలను పూర్థిస్థాయిలో నిర్మూలించిన ప్రాంతంలోనే ఆయనను సన్మానించారు. పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించి.. పది మందికి స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు.