ఆదిబట్ల, డిసెంబర్ 21 : విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం.. వెంటనే రెగ్యులరైజ్ చేయాలని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి దుర్గం శ్రీను డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని, ప్రభుత్వంలోకి వెంటనే తీసుకోవాలని ఉద్యోగులు రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరసన దీక్షలు శనివారం నాటికి 16వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు నల్లని దుస్తులు ధరించి నిరసన తెలిపారు.
అనంతరం దుర్గం శ్రీను మాట్లాడుతూ.. గత రెండు దశాబ్దాలుగా అభ్రదతాభావంతో చాలీచాలని వేతనాలతో జీవితాలను వెల్లదీస్తున్నారని.. ఎన్ని ప్రభుత్వాలు మారినా వారికి అన్యాయమే జరుగుతున్నదన్నారు. రేవంత్రెడ్డి హామీ ఇచ్చిన ప్రకారం ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలన్నారు. దీక్షలో కూర్చున్న వారిలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు అజీజ్, ప్రధాన కార్యదర్శి సంపత్, కోశాధికారి సాయికుమార్, మహిళా నాయకులు శ్రీలత, పద్మ, భార్గవి, సుజాత, అధిక సంఖ్య లో ఉద్యోగులు పాల్గొన్నారు.
వికారాబాద్ : తమ డిమాండ్ల సాధన కోసం గత 16 రోజులుగా నిరసన దీక్షలు చేపట్టినా ప్రభుత్వం స్పం దించకపోవడంతో శనివారం ఒక సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగిని చాకలి ఐలమ్మ వేషధారణలో నిరసన తెలిపారు. ఐలమ్మ స్ఫూర్తితో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం తమను విద్యాశాఖలో విలీనం చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంగ్యానాయక్, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.