వికారాబాద్, జనవరి 2 : సమగ్ర శిక్షా ఉద్యోగులందరికీ న్యాయం జరిగేవరకు సమ్మె కొనసాగుతుందని వికారాబాద్ జిల్లా సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేతావత్ గాంగ్యానాయక్ తెలిపారు. గురువారం వికారాబాద్‌లో ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించి బీజేఆర్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్‌రెడ్డి మాస్కులు ధరించి, బైఠాయించి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. సమగ్ర శిక్షా ఉద్యోగుల సమ్మె 28వ రోజుకు చేరింది. వీరికి బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు రాజ్‌కుమార్ మద్దతు తెలిపారు.
వికారాబాద్ ఆర్డీవో వాసుచంద్రకు సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. న్యాయమైన డిమాండ్ల సాధనలో భాగంగా సమగ్ర శిక్షాను విద్యాశాఖలో విలీనం చేసి ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయాలన్నారు. సమ్మెలో జిల్లాలోని 540 మంది సమగ్ర శిక్షా ఉద్యోగులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. వీరికి మద్దతుగా ఎంఆర్సీ, సీఆర్సీ, పాఠశాల, కేజీబీవీ, యూఆర్ఎస్, మోడల్ స్కూల్, డీపీవో స్థాయిలో అన్ని విభాగాల ఉద్యోగులు సమగ్ర శిక్షా ఉద్యోగులకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు.
సమగ్ర శిక్షా ఉద్యోగులను వెంటనే విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని, అప్పటివరకు తక్షణమే పేస్కేల్ అమలు చేయాలన్నారు. మోడల్ స్కూల్లో సమగ్రశిక్షాకు అనుబంధంగా పనిచేస్తున్న ఉద్యోగులను న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మహిళా నాయకురాలు ప్రభావతి, డీపీవొ శేఖర్, మెసెంజర్ అధ్యక్షుడు శ్రీశైలం, పీటీఐ అధ్యక్షుడు రవికుమార్, ఆయా మండలాల కేజీబీవీ పాఠశాలల ఎస్వోలు పాల్గొన్నారు.