శంకర్పల్లి, జులై 16 : స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శంకర్పల్లి మండలం జన్వాడ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. మళ్లీ కేసీఆర్ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో కాంగ్రెస్ పాలన పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని, శంకర్పల్లిలో త్వరగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించాలని సూచించారు. పాలకులు మంచి వారుంటే ప్రకృతి సహకరిస్తుందని, కేసీఆర్ పదేళ్ల పాలనలో వర్షాలు కురిసి చెరువులు మత్తడి దుంకి తెలంగాణ నేల సస్యశ్యామలమైందన్నారు.
నేడు వర్షాలు సమృద్ధిగా కురవడంలేదన్నారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ప్రకృతి కూడా సహకరిస్తుందని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు చెబితేనే ప్రాజెక్టుల గేట్లు తెరుస్తున్నారని, రైతు భరోసాను రెండుసార్లు ఎగ్గొట్టి, ఒక్కసారి వేసి సంబరాలు అంటే గతంలో కేసీఆర్ హయాంలో 11 సార్లు వేసినప్పుడు ఎన్నిసార్లు సంబరాలు చేసుకోవాలని ప్రశ్నించారు. రైతు చనిపోతే రూ.5 లక్షలు బీమా రూపంలో డబ్బులు వచ్చేవని, నేడు అవి కాస్తా ప్రస్తుత ప్రభుత్వం ఆపేసిందన్నారు. మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చాయని రైతు బంధు వేస్తున్నారని, మళ్లీ సార్వత్రిక ఎన్నికల వరకు రైతు భరోసా వేయరని తెలిపారు. గతంలో 6 లక్షల 43 వేల రేషన్ కార్డులు ఇచ్చినా ఎప్పుడూ ఈ ప్రభుత్వం లాగా హంగామా చేయలేదన్నారు.
నేడు ఎన్నికల కోసం రేషన్ కార్డులు అంటూ ప్రచారం చేస్తున్నారన్నారు. కేసీఆర్ హయాంలో మిషన్ భగీరథ ద్వారా నీటి కష్టాలు, కరెంట్ కష్టాలు తీర్చితే నేడు మళ్లే ఈ ప్రభుత్వం పాత రోజులు తెచ్చిందన్నారు. మహిళలు ఖాళీ బిందెలతో రోడ్లు ఎక్కుతున్నారన్నారు. అధికారులు ప్రజల పక్షంగా పని చేయాలని, గతంలో అధికారులు ఎప్పుడు కూడా ప్రస్తుతం లాగా పాలక పక్షం మెప్పు కోసం పని చేయలేదన్నారు. కల్యాణలక్ష్మీతో పాటు ఇస్తామన్న తులం బంగారం, విద్యార్థినులకు ఇస్తామన్న స్కూటీల హామీని ఇంకా నెరవేర్చలేదన్నారు. ఓడిపోతారనే భయంతోనే స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం వెనుకంజ వేసిందని, కోర్టు ఆదేశాలతో తప్పనిసరి పరిస్థితి వచ్చిందన్నారు.
స్థానిక ఎన్నికల్లో ఊరూరా గులాబీ జెండా ఎగురాలని, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి, బీఆర్ఎస్ పటిష్టత కోసం మరింత పాటుపడాలన్నారు. మహిళలకు రూ.2500 ఎప్పుడు ఇస్తారని, వడ్డీ లేని రుణాలు కూడా పూర్తి స్థాయిలో వేయలేదని సబితారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మండల సమన్వయ కమిటీ వేసుకొని, గ్రామగ్రామాన పర్యటించి బీఆర్ఎస్ గెలుపునకు బాటలు వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శంకర్పల్లి మాజీ ఎంపీపీ ధర్మన్నగారి గోవర్ధన్ రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ బద్దం శశిధర్ రెడ్డి, మాజీ సర్పంచ్ లు, ఎంసీటీసీలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.