సకల వసతులతో నిర్మించిన రైతు వేదికలు చైతన్య దీపికలై అన్నదాతలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ప్రధానంగా సమావేశాలు, సదస్సుల నిర్వహణకు సౌకర్యవంతంగా మారాయి. అధునాతన వ్యవసాయ పద్ధతులు, పంటల సాగుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వ పథకాలు వంటి వాటిపై అధికారులు అవగాహన కార్యక్రమాలు ఇందులోనే నిర్వహిస్తున్నారు. గతంలో మండలానికి ఒకరు, కొన్ని చోట్ల రెండు మండలాలకు ఒక ఏఈవో ఉన్న దృష్ట్యా అధిక గ్రామాలుండడంతో రైతులకు అందుబాటులో ఉండేందుకు వీలుండేది కాదు. సీఎం కేసీఆర్ ప్రతి 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌ను ఏర్పాటు చేయడంతోపాటు క్లస్టర్‌కో ఏఈవోను నియమించడంతో రైతులకు మెరుగైన సేవలందుతున్నాయి. జిల్లాలో మొత్తం 83 వ్యవసాయశాఖ క్లస్టర్ల పరిధిలో 83 రైతువేదిక భవనాలను నిర్మించారు. ఒక్కో రైతు వేదిక నిర్మాణానికి ప్రభుత్వం రూ.22 లక్షల చొప్పున రూ.18.26కోట్లను ఖర్చు చేసింది. టేబుళ్లు, కుర్చీలు, మైక్ సిస్టంతోపాటు పలు సామగ్రిని సమకూర్చింది. ఏఈవో, రైతుబంధు సమితి కో-ఆర్డినేటర్ కోసం రెండు గదులు, రైతుల సమావేశం కోసం ఒక మీటింగ్ హాలుతో కూడిన రైతు వేదికలను నిర్మించారు. రైతు వేదికల నిర్వహణ కోసం తొలుత రూ.2వేలు చొప్పున అందించిన ప్రభుత్వం ఆ తర్వాత రూ.9వేల చొప్పున అందిస్తున్నది. రైతు వేదికల్లో నిర్వహించే సమావేశాల్లో వ్యవసాయశాఖ అధికారులతో పాటు రైతుబంధు సమితి సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని రైతుల సందేహాలను నివృత్తి చేస్తున్నారు. సాగు సమస్యలకు ఎప్పటికప్పుడు పరిష్కారం లభిస్తుండడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
-రంగారెడ్డి, నవంబర్ 1(నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, నవంబర్ 1(నమస్తే తెలంగాణ) : వ్యవసాయంలో సలహాలు, సూచనలు రైతుల ముంగిట్లోకే వచ్చాయి. సాగులో అధునాతన పద్ధతులు, పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఇలా ప్రతి సమాచారం రైతులకు చేరువైంది. సాగుకు సంబంధించిన ఏ సమస్యకైనా మండల కేంద్రానికే, జిల్లా కేంద్రానికో వెళ్లాల్సిన అవసరం లేకుండా.. తెలంగాణ ప్రభుత్వం ఊరూరా రైతు వేదికలను అందుబాటులోకి తెచ్చింది. రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ క్లస్టర్‌కు ఒక్కటి చొప్పున 83 రైతు వేదికలను నిర్మించింది. ప్రతి వేదికకు రూ.22లక్షలను ఖర్చుపెట్టి మొత్తంగా రూ.18.26కోట్లను రైతు వేదికల కోసం ప్రభుత్వం వెచ్చించింది. సాగు సమస్యలకు సత్వరమే పరిష్కారం లభిస్తుండడంతో రైతాంగం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నది.
స్వరాష్ట్రంలో సాగుకు అనుకూలమైన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలో ప్రతి సీజన్లోనూ 3లక్షల ఎకరాలకు పైగా పంటలను రైతాంగం సాగు చేస్తూ వస్తున్నది. పెరిగిన సాగుకు అనుగుణంగా రైతులకు సేవలను మరింత విస్తృతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఇందులో భాగంగా ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌ను గుర్తించి.. క్లస్టర్‌కో ఏఈవోను నియమించింది.
ప్రతి క్లస్టర్లోనూ రైతు వేదికలను నిర్మించి ఏఈవో నిత్యం రైతులకు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసింది. ఏఈవోతోపాటు కో-ఆర్డినేటర్ కోసం టేబుళ్లు, కుర్చీలు, మైక్ సిస్టంతోపాటు పలు సామగ్రిని సమకూర్చింది. ఏఈవో, రైతు బంధు సమితి కో-ఆర్డినేటర్ కోసం రెండు గదులు, రైతుల సమావేశం కోసం ఒక మీటింగ్ హాలు ఉండేలా రైతు వేదికలను సర్వాంగ సుందరంగా ప్రభుత్వం తీర్చిదిద్దింది. రైతులంతా వేదికలో కూర్చుని చర్చించుకోవడానికి అన్ని సదుపాయాలను సమకూర్చింది. రైతు వేదికల నిర్వహణ కోసం తొలుత రూ.2వేలు చొప్పున అందించిన ప్రభుత్వం ఆతర్వాత రూ.9వేలు అందజేస్తూ వస్తున్నది.
సత్వరమే సలహాలు, సూచనలు.
వానకాలం, యాసంగి పంటల సాగుపై రైతు వేదికల్లో ఎప్పటికప్పుడు రైతులకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, యాంత్రీకరణ, చీడపీడల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏఈవోలు రైతులకు సలహాలు, సూచలను అందజేస్తున్నారు. క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లినప్పుడు మినహా మిగతా అన్ని సమయాల్లోనూ ఏఈవోలు రైతు వేదికల్లోనే అందుబాటులో ఉంటున్నారు. వ్యవసాయంలో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణ సమాచారంతోపాటు రైతు బంధు, రైతు బీమా, సబ్సిడీ పథకాలపై అవగాహన కల్పించడంతోపాటు సంబంధిత పథకాలకు అర్హులైన వారి నుంచి రైతు వేదికగా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఏవో, ఏడీఏతోపాటు జిల్లా వ్యవసాయ అధికారులు, కొన్ని సందర్భాల్లో కలెక్టర్లు సైతం రైతు వేదికల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఇలా.. అన్ని రకాల సేవలను ప్రభుత్వం రైతు వేదికల ద్వారా ప్రభుత్వం అందుబాటులోకి తేవడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి క్లస్టర్‌కు ఒకటి చొప్పున ప్రభుత్వం నిర్మించిన రైతు వేదికల్లోనే వ్యవసాయానికి సంబంధించిన అన్ని రకాల సమస్యలపై చర్చించుకుంటున్నాం. ప్రభుత్వం కల్పించే ప్రయోజనాలు, రైతులు సాగు చేసిన పంటలకు చీడపీడలు సోకినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నెలకోసారి అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఎంతో ముందుచూపుతో రైతువేదికలు నిర్మించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు.
వ్యవసాయ సాగు పద్ధతులపై అధికారులు రైతు వేదికల్లో సమావేశాలు పెట్టి అవగాహన కల్పిస్తున్నారు. పంటలకు చీడపీడలు సోకితే ఏం చేయాలి.. పంట ఏ దశలో ఉంటే ఏ ఎరువులు వాడాలో తెలుపుతున్నారు. పంట నష్టపోకుండా ముందే వచ్చే సమస్యలను చెప్పుతుండడం ఎంతో ఉపయోగకరంగా ఉన్నది. వ్యవసాయ రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ శ్రద్ధ తీసుకోవడం అభినందనీయం.
రైతు వేదిక కట్టిన నాటి నుంచి వ్యవసాయాధికారులు రైతులకు దగ్గరయ్యారు. అప్పట్లో ప్రతి చిన్న పనికి కొడంగల్ ఆఫీసుకు పోవాల్సి వచ్చేది. అక్కడ సార్లు కనిపించే వారు కాదు. పది సార్లు తిరగాల్సి వచ్చేది. రైతు వేదికలో అధికారి ఉండటంతో ఎప్పటికప్పుడు సమాచారం అందుతున్నది. ఏదైన పని చేసుకోవాలంటే ఇక్కడే పూర్తి అవుతున్నది. అప్పుడప్పుడు రైతులకు మీటింగ్ పెట్టి ఏ పంట వేసుకోవాలి, మందులు ఏ విధంగా వాడాలి, ఏఏ మందులు, విత్తనాలు వాడితే ఎక్కువ లాభం వస్తుందని చెబుతున్నారు. దీంతో కొంత వరకు తక్కువ పెట్టుబడితో వ్యవసాయం చేసుకునే ఆస్కారం ఏర్పడింది. రైతు వేదిక కట్టడం వల్ల రైతులకు ఎంతో మేలు కలుగుతున్నది.
– ఫకీరప్ప, రైతు, అప్పాయిపల్లి (కొడంగల్)
రైతువేదిక కట్టక ముందు అధికారులను కలువాలంటే కొడంగల్‌కే వెళ్లాలి. ఉంటే కలిసే వాళ్లం లేదంటే ఆఫీసు ముందే కూర్చునేవాళ్లం. ఇప్పుడు మా ఊళ్లోనే రైతు వేదిక భవనం కట్టడంతో ఇక్కడ అధికారి ఉంటుండు. దీంతో చాలా వరకు సమయం కలిసి వస్తుంది. సబ్సిడీ విత్తనాలు వచ్చినా, రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసినా ఉపయోగించుకొంటున్నాం.
– ఆశన్న, రైతు, అప్పాయిపల్లి (కొడంగల్)
రైతు వేదికలు నిర్మించడం వల్ల పొలాలకు అనుగుణంగా ఏ విత్తనాలు వాడాలో అధికారులు తెలుపుతున్నారు. సమావేశాలను ఏర్పాటు చేసి సాగు పద్ధతులను వివరిస్తున్నారు. దళారుల చేతిలో మోసపోకుండా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు.
– బాలు (చేవెళ్లటౌన్)
రైతు వేదికలు నిర్మించిన తర్వాత అధికారులు అందుబాటులో ఉంటున్నారు. గతంలో అధికారులను కలువాలంటే చాలా ఇబ్బందులు పడేవాళ్లం. కార్యాలయాల చుట్టూ తిరిగేటోళ్లం. సీఎం కేసీఆర్ రైతులకు రైతు వేదికలను నిర్మించడం వల్ల ఎంతో మేలు జరుగుతున్నది.
– గోరెంట్ల మల్లేశ్ యాదవ్, గ్రామం కలకొండ (మాడ్గుల)
సీఎం కేసీఆర్ రైతు బాంధవుడు. అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఆదుకుంటున్నాడు. రైతుల గోస తెలిసిన నాయకుడు కాబట్టే రైతు వేదికలను నిర్మించి అండగా నిలిచాడు. రైతులు సాగుపై చర్చించుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. ప్రభుత్వ పథకాల సమాచారాన్ని అధికారులు అందిస్తున్నాది.
– కురుమ వెంకటేశ్, మిర్జాగూడ (శంకర్పల్లి)
రైతు పక్షపాతి సీఎం కేసీఆర్. అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అండగా నిలుస్తున్నారు. రైతు వేదికల నిర్మాణంతో సాగులో ఏర్పడిన సమస్యలపై రైతులమంతా కలిసి చర్చించుకుంటున్నాం. రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా వ్యవసాధికారులు రైతు వేదికల్లో సమావేశాలను ఏర్పాటు చేసి నివృత్తి చేస్తున్నారు. పంట నష్టపోకుండా సలహాలు, సూచనలు చేస్తున్నారు. ఏలాంటి అవసరం వచ్చినా రైతు వేదిక వద్దకు వెళ్లి అధికారులతో పనులు సులువుగా చేసుకుంటున్నారు. రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న బీఆర్ఎస్ సర్కార్‌కు కృతజ్ఞతలు.
– శంకర్, రైతు ఫరూఖ్‌నగర్(షాద్‌నగర్‌రూరల్)
రైతు వేదికలు అన్నదాతలకు ఎంతో ఉపయోగం.. రైతులను ఒకచోటకు చేర్చి సమావేశం నిర్వహిస్తుండటంతో ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతున్నాం. వ్యవసాయ అధికారులు పంటల సాగుపై సలహాలు, సూచనలు ఇస్తున్నారు. పొలం నుంచి మట్టిని సేకరించి భూసార పరీక్షలు నిర్వహించి ఏ పంట సాగు చేయాలి, ఎంత మోతాదులో ఎరువులు వాడాలి తదితర విషయాలను తెలియజేస్తున్నారు. అధికారులు ఇస్తున్న సూచనలతో పంట పెట్టుబడి ఖర్చులు తగ్గడంతోపాటు దిగుబడి పెరిగింది. రైతుల సంక్షేమం కోసం పని చేస్తున్న సీఎం కేసీఆర్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు.
-సిద్ధిగారి చెన్నయ్య (కడ్తాల్)
రైతు వేదిక భవనంలోనే ధాన్యం కొనుగోలు చేపట్టడం వల్ల ధాన్యం నిలువ చేసుకునేందుకూ సౌకర్యంగా ఉన్నది. రైతులంతా కూర్చొని మాట్లాడుకునే సదుపాయం కలిగింది. లేదంటే ఎవరికి వారే అన్నట్లుగా ఉండేది. వ్యవసాయాధికారులను కలువాలంటే గతంలో మండల, జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. సీఎం కేసీఆర్ రైతు కష్టాలను దృష్టిలో పెట్టుకొని ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌గా రైతు వేదికలను నిర్మించడం వల్ల వ్యవసాయాధికారులు అందుబాటులో ఉంటున్నారు. టేకులపల్లిలో రైతు వేదిక నిర్మించారు. ఏఈవోలు అందుబాటులో ఉంటున్నారు. రైతు వేదికలతో రైతులకు ఎంతో మేలు సమకూరుతున్నది.
– గొల్ల రాములు, టేకులపల్లి (మోమిన్‌పేట)
తెలంగాణ ప్రభుత్వం రాక ముందు వ్యవసాయ అధికారులను కలువాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. వారికి ఒక తావు ఉండేది కాదు. కేసీఆర్ ప్రభుత్వంలో అధికారులను కలువడానికి సులువైంది. రైతు వేదికల్లో ఉంటూ రైతుల వద్దకే వస్తున్నారు. ఎరువులు, విత్తనాలకు ఇబ్బంది లేకుండా పోయింది. ఎలాంటి సమస్యలైనా వెంటనే పరిష్కారమవుతున్నాయి. రైతు సమావేశాలు ఏర్పాటు చేసి సాగు విధానాలపై అవగాహన కల్పిస్తున్నారు. పంటలకు సోకే చీడపీడల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుపుతున్నారు. రైతుల కోసం ఇంతగా శ్రమిస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– ఎట్టయ్యగౌడ్, రైతు, సురంగల్(మొయినాబాద్)
రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అన్ని రకాల సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. రైతువేదికలతో అధికారులు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఎలాంటి సమస్యలున్నా ఒక్కదగ్గర కు చేరి చర్చించుకోవడానికి రైతువేదికలు ఉపయోగపడుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.
– మహ్మద్ జానీపాషా, మార్కెట్ కమిటీ డైరెక్టర్ (ఇబ్రహీంపట్నంరూరల్)
రైతుల కోసం అనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న బీఆర్ఎస్ రైతు ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్నది. రైతువేదికల నిర్మాణంతో గ్రామీణ ప్రాంతాల రైతులు సభలు, సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. గతంలో వేదిక లేక ఎవరికి తోచినట్లు వారు సాగు చేసుకుని నష్టపోయేవాళ్లం. వ్యవసాయ అధికారులు రైతువేదికల్లో సమావేశాలు నిర్వహించి సలహాలు, సూచనలు ఇస్తున్నారు.