రంగారెడ్డి జిల్లాలో రైతుబంధు సాయం మరింత మంది రైతులకు అందనున్నది. ఇదివరకు జిల్లావ్యాప్తంగా 3,04,111 మంది లబ్ధిదారులు ఉండగా.. ప్రస్తుతం కొత్తగా మరో 3,030 మంది రైతులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దీంతో ప్రభుత్వం అందించే రైతుబంధు సాయం మరింత పెరుగనున్నది. వానకాలంలో జిల్లాకు రూ.378,48,28,980 నిధులను కేటాయించగా, ఈసారి లబ్ధిదారుల సంఖ్య పెరిగిన దృష్ట్యా మరిన్ని నిధులు అందనున్నాయి. ఈ యాసంగికి సంబంధించి ఈ నెల 28 నుంచి దశలవారీగా అన్నదాతల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ కానుండడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
రంగారెడ్డి, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : దేశంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి పంట కాలానికి తగిన విధంగా ఎరువుల కొనుగోలు, వ్యవసాయ పనిముట్లకు ప్రతి రైతుకు ఎకరాకు ఐదువేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నది. ఇలా రెండు పంటలకు సంబంధించి ఎకరాకు పది వేల రూపాయలను పెట్టుబడిగా ఇస్తున్నది. ప్రభుత్వ సాయం ఎకరం నుంచి మొదలై చివరి రైతు వరకు చేరుతుంది. వానకాలం (ఖరీఫ్) పంటలు పూర్తి కాగా, యాసంగి (రబీ) పంటల కాలం ఇప్పుడిప్పుడే మొదలవుతున్న దశలో రైతు చేతికి పెట్టుబడి సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈ నెల 28 నుంచి రైతులకు సంబంధిత బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు జమ కానున్నాయి. రబీ కాలంలో సాగు చేయనున్న పంటలకు పెట్టుబడి సాయం పడనుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వాల హయాంలో చాలా ఇబ్బందులను పడే వాళ్లమని, మనదైన ప్రభుత్వం, మన పాలన రావడంతో చాలా వరకు ఇబ్బందులు, ప్రధానంగా రైతులకు సంబంధించిన కష్ట నష్టాలు తొలగిపోయాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మరింతగా యాసంగి సాయం
జిల్లాలో ఇప్పటికే రూ.378,48,28,980 నిధులు కేటాయించినది. అందులో భాగంగా మొత్తం రూ. 343,97,49,607 రైతుల ఖాతాల్లో జమయ్యాయి. ప్రస్తుతం యాసంగి కొనసాగుతుండటంతో రైతులు ఆర్థిక సాయానికి ఎదురు చూడకుండా, ప్రభుత్వం ముందస్తుగానే ఈ నెల 28 వరకు వారి వారి ఖాతాల్లోకి డబ్బులను జమ చేయనుంది. గత వానాకాలాని కంటే మించి యాసంగిలో 3,030 మంది కొత్తగా నమోదైనట్లు తెలిసింది. వీరి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఆర్థిక సాయం మరో 3వేల మందికి పైగానే ఈసారి మంజూరయ్యే అవకాశం ఉంది. కాగా, ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయాన్ని అందిపుచ్చుకునేందుకు ఆనందం వ్యక్తం చేస్తూ, కేసీఆర్ పాలన పది కాలాల పాటు పచ్చగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు.
చాలా సంతోషంగా వ్యవసాయం
– హరిమోహన్‌రెడ్డి, రైతు, రాంపూర్
గతంలో వ్యవసాయం అంటే దుఃఖం, కష్టం, నష్టం, ఇబ్బందులతో కూడుకొని ఉండేది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కేసీఆర్ ఆధ్వర్యంలో ఇచ్చే పెట్టుబడి సహకారంతో స్వేచ్ఛగా, సంతోషంగా వ్యవసాయం చేస్తున్నా. నాకున్న ఐదెకరాలకు ఒక్కో కాలానికి రూ.25 వేల చొప్పున రైతు బంధు డబ్బులు వస్తున్నాయి. రైతుల సంక్షేమం కోసం రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్ ఇస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
రైతు బంధు సాయంతో ధీమాగా..
– ఎర్రవల్లి శ్రీనివాస్‌రెడ్డి, దేవునిఎర్రవల్లి
సీఎం కేసీఆర్ రైతులకు అందిస్తున్న పంటల పెట్టుబడి సాయంతో ధీమాగా వ్యవసాయం చేస్తున్నా. ఏ ప్రభుత్వమూ చేయని రైతు సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి రైతులను ఆదుకుంటున్నారు. గతంలో అప్పు చేసి పంట పెట్టుబడి పెట్టేవాళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ప్రభుత్వమే రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేయడం శుభ పరిణామం. సీఎం కేసీఆర్‌కు రైతులందరూ రుణపడి ఉంటారు.
రైతు బంధుతో గొప్ప సాయం
– గుర్రాల రాజిరెడ్డి, ధర్మసాగర్
దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ రైతు బంధును ప్రవేశపెట్టి రైతులను కష్ట నష్టాల నుంచి బయటపడేసి ఓదార్పును ఇస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న రైతు బంధుతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంట పెట్టుబడిని వినియోగిస్తూ జీవిస్తున్నారు. గతంలో పెట్టుబడికి అప్పులు చేసి చాలా ఇబ్బందులు పడేవాళ్లం. ప్రస్తుతం అలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా పంట పండిస్తున్నాం. రైతు బంధు రైతుల పాలిట గొప్ప సాయం. ఈ నెల 28 నుంచి ఖాతాల్లో రైతు బంధు డబ్బు జమవుతుందని తెలియడంతో చాలా సంతోషంగా ఉంది.