Rahul Ramakrishna | ప్రముఖ నటుడు, కమెడియన్ రాహుల్ రామకృష్ణ మరోసారి తన సోషల్ మీడియా పోస్టులతో వార్తల్లో నిలిచారు. సామాజిక, రాజకీయ అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉండే రాహుల్, తాజాగా జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి చేసిన ట్వీట్లు చర్చనీయాంశంగా మారాయి. ఆయన లేవనెత్తిన ప్రశ్నలు ప్రస్తుతం రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. సోషల్ మీడియాలో తరచూ తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించే రాహుల్ రామకృష్ణ, గతంలో తాను సోషల్ మీడియాకు దూరమవుతున్నట్లు ప్రకటించినప్పటికీ అప్పుడప్పుడు కీలక అంశాలపై స్పందిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి పలు ప్రశ్నలు సంధించారు.
గిరిజన ప్రాంతాల్లో అమలు చేయాల్సిన ‘పెసా’ చట్టం (PESA Act), గ్రామసభల నిర్వహణ, అటవీకరణ కార్యక్రమాల అమలుపై వివరణ ఇవ్వాలని ఆయన కోరారు. తన ట్వీట్లో “పెసా 1/70 చట్టం, గ్రామసభల అమలుకు సంబంధించిన ఫలితాలను ప్రజలకు తెలియజేయాలి. అటవీకరణ కార్యక్రమాలు ఎంతవరకు అమలయ్యాయి? స్వతంత్ర సంస్థలు ధృవీకరించిన కొన్ని గణాంకాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి” అని పేర్కొన్నారు.ఇక మరో ట్వీట్లో సమాచార హక్కు చట్టం (RTI) అమలుపై ప్రశ్నలు లేవనెత్తారు. “మీరు నిర్వహిస్తున్న ప్రతి శాఖలో సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 4(1)(బి) ప్రకారం ముందస్తు సమాచార వెల్లడిని పూర్తిస్థాయిలో అమలు చేశారా?” అని పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించారు.
అయితే ఈ ప్రశ్నలను విమర్శల కోణంలో కాకుండా బాధ్యతాయుతమైన పౌరుడిగా, అభిమానిగా అడుగుతున్నానని రాహుల్ స్పష్టం చేశారు. “నేను మీ అభిమానిని. అందుకే ఈ ప్రశ్నలు అడుగుతున్నాను. ప్రజాప్రతినిధులు ప్రజలకు నిరంతరం సమాధానం చెప్పే బాధ్యత కలిగి ఉంటారు” అని ఆయన పేర్కొన్నారు. రాహుల్ రామకృష్ణ చేసిన ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. కొందరు ఆయన లేవనెత్తిన ప్రశ్నలను సమర్థిస్తుండగా, మరికొందరు రాజకీయ అంశాల్లో సినీ ప్రముఖుల జోక్యంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్లపై జనసేన పార్టీ లేదా పవన్ కళ్యాణ్ నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. అయితే రాహుల్ రామకృష్ణ వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.