కులకచర్ల, మే 8 : కులకచర్ల, చౌడాపూర్ మండలాల పరిధిలోని వివిధ గ్రామాల్లోకి వెళ్లేందుకు రోడ్లు సరిగా లేకపోవడంతో వివిధ ప్రైవేటు వాహనాల ద్వారా వెళుతూ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. కులకచర్ల మండల పరిధిలోని కామునిపల్గి గ్రామపంచాయతీ పరిధిలోని బోజ్యానాయక్తండాకు రోడ్డు సౌకర్యం లేదు. బండవెల్కిచర్ల గ్రామం నుంచి సాల్వీడ్, చెల్లాపూర్ గ్రామాలకు రోడ్డు ఉన్నా శిథిలావస్థకు చేరుకున్నది. హన్మ్యానాయక్తండా గ్రామపంచాయతీకి చెల్లాపూర్ నుంచి బీటీ రోడ్డు లేదు. ఎర్రగోవింద్ తండాకు వెళ్లేందుకు బీటీ రోడ్డు సౌకర్యం కల్పించలేదు. మండల పరిధిలోని అంతారం బిందెంగడ్డతండా, చెరువుముందలి తండా, ఎత్తుకాల్వతండా, గోప్యానాయక్‌తండా(ఘనాపూర్), గోప్యానాయక్‌తండా(రాంనగర్), ఘట్టన్నపల్లి, చెరువుముందలితండా(కె), గోరిగడ్డతండా, పటెల్చెరువుతండాలకు కూడా బీటీ రోడ్డు సౌకర్యం లేదు. చౌడాపూర్ మండల పరిధిలోని లింగంపల్లి, అడవివెంకటాపూర్ గ్రామపంచాయతీలకు ఉన్న పాత రోడ్డు శిథిలావస్థకు గురికావడంతో ప్రతి రోజూ కులకచర్ల, చౌడాపూర్ మండల కేంద్రాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విఠలాపూర్, వీరాపూర్ గ్రామపంచాయతీలకు కూడా బీటీ రోడ్డు సౌకర్యం లేదు. శిథిలావస్థకు చేరిన రోడ్లపై వెళ్లేందుకు ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.
కులకచర్ల, చౌడాపూర్ మండలాల పరిధిలోని వివిధ గ్రామపంచాయతీలకు బీటీ రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తమ గ్రామ పంచాయతీలకు బీటీ రోడ్లు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బీటీ రోడ్ల కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నామని తెలిపారు. విఠలాపూర్, ఈర్లవాగుతండాగ్రామపంచాయతీలకు రోడ్డు సౌకర్యం కల్పించలేదు. కులకచర్ల మండల పరిధిలోని పటేల్చెరువుతండా, అనంతసాగర్, చెరువుముందలితండా(ఎ) గ్రామాలకు రోడ్లు మంజూరైనా చాలాకాలంగా పెండింగ్‌లోనే ఉన్నది.
ప్రతి గ్రామపంచాయతీకి బీటీ రోడ్డు ఉండాలని గతంలో చెప్పి.. కొన్ని గ్రామ పంచాయతీలకు నిధులు కూడా మంజూరు చేశారు. కాని ఇప్పటివరకు కాంట్రాక్టర్లు ప్రారంభించలేదు. వర్షాకాలం వస్తే ఆయా గ్రామాలకు వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు పడనున్నారు. కనీసం మంజూరైన రోడ్లను ముందుగా ప్రారంభించి.. మంజూరుకాని రోడ్లకు నిధులు విడుదల చేసి రోడ్ల వ్యవస్థను పునరుద్ధరిస్తే వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు తప్పుతాయి.
– రవినాయక్, మాజీ సర్పంచ్ గోగ్యానాయక్తండా, చౌడాపూర్ మండలం
ప్రతి గ్రామానికి, ప్రతి తండాకు బీటీ రోడ్లను సర్కారు వేయించాలి. తండాల్లో పాఠశాలలకు వచ్చే ఉపాధ్యాయులు, ఇతర పాఠశాలలకు చదువుకునేందుకు వెళ్లే విద్యార్థులు రోడ్డు సౌకర్యం సక్రమంగా లేక ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు బాగుంటేనే అన్ని రకాలుగా వ్యవస్థ బాగుంటుంది. సర్కారు స్పందించి తండాలకు ముందుగా రోడ్డు సౌకర్యం కల్పించాలి.
– రాథోడ్ శ్రీనివాస్‌నాయక్, గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు, కులకచర్ల మండలం