వికారాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు వేతన సవరణ, పెండింగ్ డిమాండ్ల పరిష్కారం కోసం మంగళవారం అర్ధరాత్రి నుంచే కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. ఆర్టీసీ సమ్మె ప్రభావంతో బుధవారం బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ప్రగతి రథ చక్రం లేకపోవడంతో జిల్లా అంతటా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డా రు. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె దృష్ట్యా ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా అధికారులు ప్రైవేట్ బస్సులను నడిపేందుకు యత్నించినా కార్మికులు అడ్డుకోవడంతో ఎక్కడిక్కడ డిపోలకే అవి పరిమితయ్యాయి.
ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీసుల బందోబస్తుతో ప్రైవేట్ బస్సులు నడిపేందుకు ప్రయత్నించినా ఆర్టీసీ కార్మికులు బైఠాయించి ఒక్క బస్సును కూడా వెళ్లనివ్వకపోవడం గమనార్హం. ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో బస్టాండ్లు వెలవెలబోయాయి. మరోవైపు ప్రయాణికులు బస్సుల కోసం గంటల తరబడి ఎదురుచూసి చివరకు ఆటోలు, జీపులు తదితర ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. దీనిని ఆసరాగా తీసుకున్న ప్రైవేట్ వాహనాల యజమానులు ప్రయాణికుల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేశారు. మరోవైపు ప్రైవేట్ వాహనాలను అద్దెకు తీసుకొని వికారాబాద్ డిపో పరిధిలో 6 బస్సులు, పరిగి డిపో పరిధిలో 3 బస్సులు, తాండూరు డిపో పరిధిలో ఒక్క బస్సును కండక్టర్లు లేకుండానే నడిపించినట్టు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.

సమ్మెలో పాల్గొన్న 908 మంది ఉద్యోగులు
ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెలో జిల్లాలోని మూడు డిపోల పరిధిలోని 908 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే నిరవధిక సమ్మె షురూకాగా, జిల్లాలో బుధవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి వికారాబాద్, పరిగి, తాండూరు డిపోల ఎదుట కార్మికులు, ఉద్యోగులు బైఠాయించి బస్సులను బయటికి వెళ్లనివ్వకుండా ఆందోళన చేపట్టారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ ఉద్యోగులంతా డిపోల వద్ద బైఠాయించి సమ్మెలో పాల్గొనడంతో మూడు డిపోల పరిధిలోని 247 బస్సులు అక్కడే నిలిచిపోయాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్, బీజేపీ, వామపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. తాండూరు డిపో పరిధిలో 100 బస్సులుండగా, 351 మంది కార్మికులు, వికారాబాద్ డిపో పరిధిలో 268 మంది కార్మికులుండగా, 68 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. పరిగి డిపో పరిధిలో 289 మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొనగా, 79 ప్రభుత్వ, ప్రైవేట్ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి.
పరిగి డిపో నుంచి బస్సులను నడిపించేందుకు ఆర్టీసీ అధికారులు యత్నించగా కార్మికులు అడ్డుకున్నారు, దీంతో కొంతసేపు ఆర్టీసీ కార్మికులు-పోలీసులకు మధ్య వాగ్వా దం జరిగింది. బస్సులు డిపోలకే పరిమితం కావడంతో జిల్లాలోని ఆర్టీసీ డిపోలన్నీ నిర్మానుష్యంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన హామీలను పరిష్కరించకుండా మోసం చేస్తున్నదని ఆర్టీసీ కార్మికులు మండిపడ్డారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మెను కొనసాగిస్తామని హెచ్చరించారు. మరోవైపు వివిధ పనుల నిమిత్తం, వేసవి సెలవులు కావడంతో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచే ఆర్టీసీ బస్టాండ్లలో బస్సుల కోసం నిరీక్షించి.. అవి రాపోవడంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. ప్రైవేట్ ఆటోలు, జీపుల యజమానులు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడంతోపాటు సాధారణం కంటే డబుల్ చార్జీలు వసూలు చేశారు.

రంగారెడ్డి జిల్లాలో..
ఆర్టీసీ సమ్మెతో రంగారెడ్డి జిల్లాలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బుధవారం తెల్లవారుజాము నుంచే షాద్నగర్ డిపోతోపాటు పలు డిపోల నుంచి బస్సులు బయటికి రాకుండా కార్మికులు డిపోల ఎదుటే సమ్మెను కొనసాగించారు. సమ్మె నేపథ్యంలో షాద్నగర్ డిపో వద్ద ఏసీపీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. బస్సులు డిపోల నుంచి బయటికి రాకపోవడంతో వాటికోసం నిరీక్షించిన ప్రయాణికులు తిరిగి ప్రైవేట్ వాహనాల్లో తమ గమ్యస్థానాలకు వెళ్లిపోయారు. ఆర్టీసీ అధికారులు షాద్నగర్ డిపోకే పరిమితమైన బస్సులను ప్రైవేట్ డ్రైవర్లతో పోలీస్ బందోబస్తు మధ్య నడిపై యత్నం చేయగా.. కార్మికులు డిపో నుంచి బయటికి వస్తున్న బస్సులను అడ్డగించి నిరసన తెలిపా రు. మేము మా సమస్యలను పరిష్కరించాలని సమ్మె చేస్తుంటే మీరు ప్రైవేట్ డ్రైవర్ల తో బస్సులను ఎలా నడిపిస్తారని ప్రశ్నిం చి.. డిపో నుంచి ఒక బస్సు కూడా బయటికి వెళ్లకుండా అక్కడే బైఠాయించారు.