మొయినాబాద్, జూలై19 : అతి భారీ వర్షాలకు గ్రామీణ రోడ్లు ధ్వంసం అయ్యాయి. ముందే అంతాంత మాత్రాన ఉన్న గ్రామాల రోడ్లు వర్షం కురవడంతో చిన్న పాటి కుంటలను తలపిస్తున్నాయి. వాగులు, వంకలు వరద ఉధృతితో ఉప్పొంగి ప్రవహించాయి. కల్వర్టులలో వరద నీళ్లు పట్టక వాటి మీది నుంచి ప్రవహించడంతో కల్వర్టు పక్కల నుంచి గండ్లు పడి రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. మొయినాబాద్ మున్సిపాలిటి పరిధిలోని సురంగల్, పెద్దమంగళారం, మొయినాబాద్-చిలుకూరు, ముర్తుజాగూడ, మొయినాబాద్ మండల పరిధిలోని తోలుకట్టా, నక్కలపల్లి, కేతిరెడ్డిపల్లి, వెంకటాపూర్, శ్రీరాంనగర్, నగిరెడ్డిగూడ-బాకారం, చిన్నమంగళారం, ఎల్కగూడ, కుతుబుద్దీన్గూడ, రెడ్డిపల్లి, చందానగర్-పెద్దమంగళారం, మేడిపల్లి, మోత్కుపల్లి గ్రామాల రోడ్లు అతి భారీ వర్షాలతో పూర్తిగా దెబ్బతిన్నాయి. సురంగల్ నుంచి వెంకటాపూర్ గ్రామం వరకు పూర్తిగా బీటి ధ్వంసమై మట్టి రోడ్డు మాదిరిగా తయారై వర్షం తడితో రోడ్డు చిన్న కుంటలను తలపిస్తుంది. మొయినాబాద్-చిలుకూరు గ్రామాల మధ్య ఉన్న రోడ్డు పనులు నత్తనడక పనులు జరుగుతుండటంతో వర్షానికి ప్రస్తుతం చెరువును తలపిస్తుంది.
సురంగల్ నుంచి కనకమామిడి, వెంకటాపూర్ నుంచి కనకమామిడి గ్రామాల వరకు రోడ్లు పూర్తిగా దెబ్బతిని కుంటలను తలపిస్తున్నాయి. ఈ రోడ్ల మీద ప్రయాణం చేయడానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు పూర్తిగా గుంతలు ఏర్పడి అధ్వాన్నంగా మారడంతో కనీసం గుంతల్లో మట్టి పోసేవాడు సైతం దిక్కు లేదు. ఎవరికి చెప్పాలో అర్థం కాని పరిస్థితి నెలకొన్నది. ప్రజా పాలన అని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ప్రజలు ప్రయాణిస్తున్న రోడ్లు అధ్వాన్న పరిస్థితిలో ఉన్నాయి. రోడ్ల స్థితి గతులను మార్చే ప్రజా పాలకులు ఎవరు లేరా..? కేవలం ప్రజా పాలన అని గొప్పలు చెప్పడమేనా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజా పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రజా ప్రతినిధులు ఏమి చేస్తున్నట్లు అని ప్రజలు మండిపడుతున్నారు. రోడ్ల మీద ప్రయాణం చేయాలంటే ప్రణాళను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన అవసరం చాలా ఉందని ప్రజలు పేర్కొంటున్నారు. ప్రజా పాలన అంటే మాటలు చెప్పడం కాదని పనులు చేసి చూపిస్తే ప్రజా పాలన అని అనుకుంటారని ప్రజలు హితవు పలుకుతున్నారు.