ఇబ్రహీంపట్నం, జనవరి 7 : నియోజకవర్గంలో అసంపూర్తిగా నిలిచిపోయిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, అయినప్పటికీ వాటిని పూర్తి చేయటంలో సంబంధిత అధికారులు జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెలాఖరు లోగా వాటిని పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, తుర్కయాంజాల్, పెద్దఅంబర్‌పేట్ మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనుల్లో మరింత వేగం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు అవసరమయ్యే మౌలిక వసతులకోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసిందని గుర్తు చేశారు. ప్రజలకు ఉన్న ప్రధాన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. మిషన్ భగీరథ కింద నాలుగు మున్సిపాలిటీలకు పెద్ద ఎత్తున ప్రభుత్వం నిధులు కేటాయించిందని, ఆ నిధులతో వెంటనే రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ఆయన ఆదేశించారు. సమావేశంలో ఆదిబట్ల మున్సిపల్ కమిషనర్ అమరేందర్‌రెడ్డి, తుర్కయాంజాల్, పెద్దఅంబర్‌పేట్ మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ, ఎంపీడీవోలు జైరాంవిజయ్, మమతాబాయి, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఆపదలో అండగా సీఎం సహాయనిధి
ఇబ్రహీంపట్నం : ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయనిధి పథకం అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీకి చెందిన గొరిగె శ్రీనివాస్‌కు రూ.60 వేలు, కళమ్మకు రూ.60 వేలు, అచ్చన జయమ్మకు రూ.40వేలు, భాగ్యలక్ష్మికి రూ.29 వేలు, తొర్రూరుకు చెందిన పద్మకు రూ.37 వేలు, రంబీంకు రూ.36 వేలు, మల్లమ్మకు రూ.23 వేలు, ఎల్లయ్యకు రూ.19 వేలు అందజేశారు. మంచాల మండలం జాపాల గ్రామానికి చెందిన మంతని మల్లేష్‌కు రూ.60 వేలు, ఎల్లమ్మతండాకు చెందిన సబావట్ బడ్డుకు రూ.20 వేల చెక్కులను అందజేశారు.
అభివృద్ధికి అందరూ సహకరించాలి
పెద్దఅంబర్‌పేట : కాలనీల అభివృద్ధికి కలిసికట్టుగా ముందుకుసాగాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మున్సిపాలిటీలోని లక్ష్మారెడ్డి పాలెం కాలనీ ఆరంభంలో దాతల సహకారంతో నిర్మించిన కమాన్‌ను ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డితో కలిసి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి పనులకు అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ చెవుల స్వప్న, బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు, కౌన్సిలర్ సిద్దెంకి కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు రోహిణిరెడ్డి, పసుల రాజేందర్, నాయకులు పాశం దామోదర్, సత్యనారాయణరెడ్డి, విజయేందర్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, సురేశ్, జగన్, జీ శ్రీనివాస్‌రెడ్డి, కాలనీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.