కందుకూరు జూన్ 3: భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు ఎంతో దోహదపడతాయని కందుకూర్ డివిజన్ ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. మంగళవారం మండలంలో దెబ్బడగూడ బాచుపల్లిలో, రెవెన్యూ సదస్సులు ప్రారంభమయ్యాయి. దెబ్బడగూడలో జరిగిన కార్యక్రమంలో ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి పాల్గొని ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈనెల 20వ తేదీ వరకు రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు కొనసాగుతాయని వివరించారు. గ్రామంలో స్మశాన వాటిక స్థలం మంజూరు చేయాలని మాజీ సర్పంచ్ జంగయ్య కోరారు. కనీసం ఆరు ఎకరాల భూమిని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని పరిశీలిస్తామని జగదీశ్వర్ రెడ్డి హామీ ఇచ్చారు.
బాచుపల్లి లో….
భూ భారతితో ప్రజలకు మేలు జరుగుతుందని మార్కెట్ చైర్మన్ కృష్ణా నాయక్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి, తహసీల్దారు గోపాల్, మాజీ జడ్పిటీసీలు ఏనుగు జంగారెడ్డి, బొక్క జంగారెడ్డి,అందుగుల సత్యనారాయణతో కలసి మాట్లాడుతూ.. భూభారతి ద్వారా భూముల పాలనను మరింత పారదర్శకత కోసం భూసమస్యల శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగా రెవెన్యూ సదస్సుల ద్వారా రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుందని అన్నారు.