షాద్‌నగర్, జూలై 17: కాంగ్రెస్ పాలనలో అన్ని చీకటి రోజులే అన్న విషయాన్ని ఇప్పటికీ తెలంగాణ రైతులు మర్చిపోలేదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. సోమవారం నందిగామ మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద ఉచిత విద్యుత్తుపై రేవంత్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నిర్వహించిన రైతుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1976లోనే రైతు ల బోరుబావులకు కరెంట్ మీటర్లు పెట్టిన ఘనత కాం గ్రెస్ పార్టీకే దక్కిందని.. అప్పట్లోనే ఒక్కో రైతుకూ రూ.వందల్లో కరెంట్ బిల్లులు వచ్చిన విషయం రేవంత్‌రెడ్డి తెలియకపోవచ్చునని ఎద్దేవా చేశారు. రైతుల అభ్యున్నతికి కాంగ్రెస్ ఎప్పుడూ కృషి చేయలేదని మండిపడ్డారు. ఎప్పడు కరెంట్ వస్తుందో.. పోతుందో తెలువని దుస్థితి ఉండేదని..లోవోల్టేజీతో మోటర్లు, స్టార్టర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేవని, మూడు రోజులవరకూ విద్యుత్తు సరఫరా లేని సందర్భాలు ఎన్నో ఉన్నాయని గుర్తు చేశారు. బోరుబావుల ద్వారా గంట సమయంలో ఎన్ని ఎకరాల పొలం పారుతుందో రైతులను అడిగితే రేవంత్‌రెడ్డికి తెలుస్తుందని, ఆయన రైతు అయితే మూడు గంటల్లో మూడు ఎకరాలు పారుతుందనే విషయాన్ని చెప్పడని చురకలంటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ చీకటి రోజులు తప్పవని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ప్రభు త్వం తీసుకుంటున్న చర్యలతో అన్నదాతలు ఆనందంగా వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారన్నారు. వానలు పడితే అప్పులకోసం ఎదురు చూసే పరిస్థితి అన్నదాతలకు నేడు లేదని.. రైతుబంధుతో పెట్టుబడి సాయాన్ని అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదేనని పేర్కొన్నారు. కేసీఆర్ రైతు సంక్షేమమే ధ్యేయంగా తన పాలనను కొనసాగిస్తున్నారన్నారు. అదేవిధంగా జడ్పీ వైస్ చైర్మన్ ఈటె గణేశ్, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ నర్సింహారెడ్డి, ఎంపీపీ ప్రియాంకగౌడ్, పద్మారెడ్డి ఉచిత కరెంట్‌పై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో వెంకట్‌రెడ్డి, రాజ్యలక్ష్మి, నర్సింహ, కృష్ణ, రాజూనాయక్, రాజు, నర్సింహాగౌడ్, శ్రావణ్‌కుమార్, సాయికుమార్, రైతు లు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
రైతులకు రేవంత్ క్షమాపణ చెప్పాలి
నందిగామ : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలని రైతుబంధు సమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి డిమాం డ్ చేశారు. సోమవారం నందిగామ మండల కేంద్రంలోని రైతువేదికలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయనికి 24 గంటల కరెంట్ అవసరం లేదని.. మూడు గంటలు సరిపోతుందని చెప్పడం సిగ్గు చేటన్నారు.