మొయినాబాద్, డిసెంబర్ 14 : ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని సంక్షేమ వసతిగృహాలు/పాఠశాలలు/కళాశాలల్లో కామన్ డైట్ మెనూ కార్యక్రమా న్ని శనివారం పండుగలా ప్రారంభించింది. అదేవిధంగా మండలంలోని చిలుకూరు గ్రామంలో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల/కళాశాలలో జరిగిన కామన్ డైట్ మెనూ కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ ప్రోగ్రామ్‌లో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డితోపాటు స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యతో అత డి వర్గం మాత్రమే పాల్గొన్నది.
అయితే కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల ఇన్చార్జి భీంభరత్ ఈ కార్యక్రమంలో కనిపించకపోవడంతో స్థానికంగా చర్చ మొ దలైంది. ముఖ్యమంత్రి కార్యక్రమం మధ్యాహ్నం 12:30 గంటలకు ఉం టే వాట్సాప్ గ్రూప్‌లో ఉదయం 10 గంటలకు పెట్టారని.. కనీసం ఫోన్ చేసి చెప్పలేదని భీంభరత్ వర్గం ఆవేదన వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే కాలె యాదయ్య, భీంభరత్ మధ్య పొసగడంలేదని.. సీఎం ప్రోగ్రామ్‌లో ఆ వర్గపోరు బహిర్గతమైందని పలువురు చర్చించుకుంటున్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఏ వర్గానికి చెందిన వారు వారే లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారని.. చేవెళ్ల కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వారు యమునా తీరే అనేలా ఉన్నదని పేర్కొంటున్నారు. ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మధ్య వర్గపోరు ఉండడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్నారు.