నాంపల్లి క్రిమినల్ కోర్టులు, జూలై 29 (నమస్తే తెలంగాణ) : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పేరుతో సీఎం రేవంత్రెడ్డి డ్రామా చేస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో సీఎంకు బుద్ధి చెప్పేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. ఎన్నికల స్టంట్ కోసమే రేవంత్రెడ్డి బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ఎత్తుకున్నారన్నారు. గతం లో అసెంబ్లీలో బిల్లు పాస్ చేశామని, ఆర్డినెన్స్ జారీ చేస్తున్నామని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. నాంపల్లిలోని పీడీపీపీ ప్రత్యేక కోర్టుకు లగచర్ల కేసు రైతులు మంగళవారం హాజరు కాగా, ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
బీసీ రిజర్వేషన్ల పేరుతో సీఎం డ్రామా చేస్తున్నారని, దమ్ముంటే వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశా రు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సీఎంతోపాటు ఆయన సోదరులు అమాయక రైతులు, ప్రజలపై అక్రమంగా కేసులు నమోదు చేయించి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని మండిపడ్డారు. కొడంగల్లో షాడో ఎమ్మెల్యేగా తిరుపతిరెడ్డి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అమాయక గిరిజన రైతులపై కేసులు బనాయించారని.. సమన్లు వచ్చేంతవరకు ఈ కేసులో ఉన్న నిందితులు కోర్టుకు హాజరుకావాల్సిన అవసరంలేదని మినహాయింపు ఇచ్చినందుకు జడ్జికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
వికారాబాద్ కోర్టు నుంచి నాంపల్లిలోని ప్రత్యేక కోర్టుకు బదిలీచేయించి ప్రభుత్వం పేద రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నదన్నారు. లగచర్లలో కాంగ్రెస్ నాయకులే అధికారులపై దాడులకు పాల్పడినట్టు వీడియోలు, ఫొటోలున్నాయని.. వారిని తప్పించి అమాయక రైతులపై కేసులు నమోదు చేసినట్టు ఆయన ఆరోపించారు. మీడియా సమావేశంలో న్యాయవాది జక్కుల లక్ష్మణ్, రైతులు పాల్గొన్నారు.