పరిగి, నవంబర్ 9 ; ఏ ఉద్యోగికైనా ఉద్యోగ విరమణ తర్వాత ఎంతో కొంత డబ్బులొస్తే వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటుంది. నెలవారీగా పింఛన్ అందితే మరింత భరోసాగా కాలాన్ని వెళ్ల దీయొచ్చు. కానీ, చిన్నారులకు అక్షరాలు దిద్దించిన అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవు తున్నారు. ప్రభుత్వం అంగీకరించిన విధంగా తమకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని, సంబంధిత శాఖ మంత్రిని కలిసి పలుమా ర్లు విజ్ఞప్తి చేసినా ఫలితంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జి ల్లా పరిధిలో 1,107 అంగన్వాడీ కేంద్రాలుండగా.. 65 ఏండ్లు దాటిన అంగన్వా డీ టీచర్లు, ఆయాలు 161 మంది ఉన్నారు.
నాలుగు దశాబ్దాలుగా విధులు…
అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కొందరు సుమారు నాలుగు దశాబ్దాలపాటు సేవలు అందించారు. 1985లో విధుల్లో చేరిన వారు ఈ ఏడాది జూన్‌లో ఉద్యోగ విరమణ చేశారు. నాలుగు దశాబ్దాల కాలంలో వారు చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడంతోపాటు వివిధ రకాల సర్వేలను చేపట్టారు. ఓటరు నమోదు ప్రక్రియలో అంగన్వాడీ టీచర్లు బీఎల్వోలుగా పనిచేయడం, పల్స్‌పోలియో కార్యక్రమాన్ని సక్సెస్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. ప్రతి చిన్న కార్యక్రమమూ గ్రామాల్లో విజయవంతమయ్యేందుకు అంగన్వాడీల సేవలను ప్రభుత్వం వినియోగించుకున్నది. నాలుగు దశాబ్దాలపాటు వివిధ రకాల సేవలందించిన తమకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో ప్రభుత్వం నాన్చుడు ధోరణిని అవలంబించొద్దని వారు కోరుతున్నారు. ప్రభుత్వం అంగీకరించినట్లు అంగన్వాడీ టీచర్లకు రూ. రెండు లక్షలు, ఆయాలకు రూ.లక్ష బెనిఫిట్ అందించాలని కోరుతున్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు దాటుతున్నా ఇప్పటివరకు తమ డిమాండ్లు పరిష్కరించకపోవడం సరైంది కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
65 ఏండ్లు దాటిన టీచర్లు, ఆయాలు 161 మంది..
వికారాబాద్ జిల్లా పరిధిలో సుమారు 161 మంది అంగన్వాడీ టీచర్లు, ఆయాలు 65 ఏండ్లు పైబడి ఉండడంతో వారిని జూలై ఒకటో తేదీ నుంచి విధులకు రావొద్దని.. వచ్చినా వేతనాలు రావని చెప్పడంతో పలువురు విధులకు వెళ్లడం లేదు. కొం దరు తమకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చేంత వరకు పనిచేద్దామని ఇంకా కొనసాగుతున్నారు. 1985లో విధుల్లో చేరిన అంగన్వాడీ టీచర్లకు అప్పటి వేతనం నెలకు రూ. 200, ఆయాలకు రూ.90 ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్ల కు రూ.13,650, ఆయాలకు రూ.9,000 పెంచింది. తమను రిటైర్ కావాల్సిందిగా సూచించిన ప్రభుత్వం బెనిఫిట్స్ విషయంలో ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోక పోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు,మూడు జిల్లాల్లో అంగన్వాడీ టీచర్లకు రూ. లక్ష చొప్పున పంపిణీ చేయగా, వాటిని వద్దని కార్యకర్తలు చెప్పినట్లు సమాచారం. ఈ విషయంలో పలుమార్లు మంత్రి సీతక్క, ప్రిన్సిపల్ సెక్రటరీని కలి సి విన్నవించినా ఫలితం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి అంగన్వా డీ టీచర్లకు రూ.2లక్షల నగదు, పింఛన్‌గా నెలకు రూ.6000, ఆయాలకు రూ.లక్ష నగదు, పింఛన్ నాలుగు వేలు అందించాలని కోరుతున్నారు.
రూ. రెండు లక్షల నగదు.. రూ.ఆరు వేల పింఛన్ ఇవ్వాలి
అంగన్వాడీ టీచర్లు, ఆయాల రిటైర్మెంట్ను 65 ఏండ్లుగా నిర్ణయించిన ప్రభుత్వం .. టీచర్లకు రూ.2 లక్షల నగదు, నెలకు రూ.ఆరు వేల పింఛన్, ఆయాలకు రూ.లక్ష నగదు, పింఛన్‌గా రూ.నాలుగు వేలు అందించాలి. ఈ అంశంపై ప్రస్తుత మంత్రి సీతక్కను పలుమార్లు కలిసి విన్నవించగా వారు అంగీకరించారు. అయినా ఒకటి రెండు జిల్లాల్లో మాత్రమే రూ.లక్ష చొప్పున ఇచ్చినట్లు తెలిసింది. ఇది ఎంతమా త్రం సరికాదు. జిల్లాలో ఒక్కరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే అందించాలి.
వేతనం లేదు, బెనిఫిట్లూ రాలేదు..
జూలై ఒకటో తేదీ నుంచి విధులకు రావొద్దని చెప్పడంతో వెళ్లడం మానేశా. నాలుగు నెలలు దాటినా ఇప్పటివరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదు. నేను బతికేదెట్లా.. కూలికి వెళ్దామన్నా చేతనయ్యే పరిస్థితి లేదు. సర్కారు ఇచ్చే పైసలు ఆసరా అవుతాయని కొండంత ధైర్యంగా ఉండే. కానీ ఇప్పటికీ దిక్కులేదు. సుమారు నాలుగు దశాబ్దాలపాటు సేవలందించా. వృద్ధ్దాప్యంలో ఆసరాగా ఉండేందుకు.. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రిటైర్మెంట్ బెనిఫిట్స్, పింఛన్ అమలు చేయాలి.