రంగారెడ్డి, మే 20 (నమస్తే తెలంగాణ) : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో అధికారుల ఆంక్షలు లబ్ధిదారుల ను ఆగం చేస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చే రూ. ఐదు లక్షలతోపాటు మరికొంత వేసుకుని సొంతింటిని నిర్మించుకుందామని భావించిన లబ్ధిదారులు అయో మయానికి గురవుతున్నారు. అంతేకాకుండా ఇండ్లు నాలుగు వందల చదరపు అడుగులకు తగ్గకుండా.. ఆరు వందల చదరపు అడుగులకు మించకుండా ఉండాలని.. అందుకు ఇంచు పెరిగినా బిల్లులు ఇచ్చే ప్రసక్తే లేదని అధికారులు తేల్చి చెబుతుండడంతో.. లబ్ధిదారుల ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. జిల్లాలోని పేదలు కొన్నేండ్లుగా సొంతింటిని నిర్మించుకునేందుకు ఎదురుచూస్తున్నారు. కాగా, కాంగ్రెస్ సర్కార్ జిల్లాకు 18,000 ఇండ్లను ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద మంజూరు చేసింది. ఒక్కో నియోజకవర్గానికి 3500 చొప్పున కేటాయించింది.
అయితే, ఆ ఇండ్లు అర్హులకు సరిపోవని.. ఇంకా కేటాయించాలని పలువురు కోరుతున్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల చొప్పున చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించగా.. అర్హులైన ఎంతోమంది పేదలు దరఖాస్తు చేసుకోగా.. వారి లో పదిశాతం మందికి కూడా ఇండ్లు దక్కడం లేదు. ఎంపికైన లబ్ధిదారులకు అధికారులు విధిస్తున్న నిబంధనలతో వారి సొంతింటి కల నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే చాలామంది లబ్ధిదారు లు తమ పాత ఇండ్లను కూల్చి.. ప్రభుత్వం రూపాయీ కేటాయించకున్నా అప్పులు తీసుకొచ్చి బెస్మెంట్ వరకు పనులను చేపట్టారు. అయితే.. ఇంటి నిర్మాణం నాలుగు వందల ఎస్ఎఫ్టీకి తగ్గకుండా ఆరు వందల చదరపు అడుగులకు మించకుండా ఉండాలని అధికారులు నిబంధనలు విధిస్తుండడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వం జిల్లాకు మొదటి విడతలో 18,000 ఇండ్లను ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద మంజూరు చేసింది. ఒక్కో నియోజకవర్గానికి 3500 చొప్పున కేటాయించింది. కాగా, జిల్లాలోని 21 మండలాల్లోని ఒక్కో గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద తీసుకుని.. అక్కడ ఇండ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టారు. లబ్ధిదారులు హడావుడిగా పనులను చేపట్టారు. అనేక మం ది పాత ఇండ్లను కూల్చి వేసి ఆరువందల చదరపు గజాల స్థలం కంటే ఎక్కువ సామర్థ్యంలో ఇండ్ల నిర్మా ణం చేపట్టారు. అయితే, ఆరువందల ఎస్ఎఫ్టీకి ఇం చు పెరిగినా బిల్లులు చెల్లించేది లేదని అధికారులు తేల్చి చెబుతుండడంతో ఇండ్ల నిర్మాణం చేపట్టిన లబ్ధిదారుల పరిస్థితి అయోమయంగా మారింది.
ఇందిరమ్మ ఇంటికోసం వృద్ధ దంపతులు ఏకంగా రాష్ట్ర ప్లానింగ్ బోర్డు చైర్మన్ నిరంజన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చినా వారికి ఇల్లు మంజూ రు కాలేదు. కాగా, ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల ఎంపికలో దివ్యాంగులకు ప్రాధాన్యామివ్వాలని నిబంధనల్లోనే ఉన్నది. అయినా, భార్యాభర్తలైన ఇద్దరు దివ్యాంగులకు ఇందిరమ్మ ఇల్లు దక్కకపోవడంతో.. సోమవారం కలెక్టరేట్‌కు వచ్చి కలెక్టర్‌కు వినతిపత్రామిచ్చి ఇల్లు ఇప్పించాలని మొరపెట్టుకున్నారు.
ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా చేస్తామని ప్రకటించింది. అయితే, లబ్ధిదారుల ఎంపిక కోసం వేసిన ఇందిరమ్మ కమిటీలు సూచించిన వారికే ఇండ్లను కేటాయించారనే ఆరోపణలున్నాయి. ఇందిరమ్మ కమిటీల్లో కాంగ్రెస్‌కు చెందిన వారే సభ్యులుగా ఉన్నారు. వారు ఇచ్చిన జాబితానే స్థానిక ఎమ్మెల్యేలు ఫైనల్ చేసి జిల్లా ఇన్చార్జి మంత్రికి పంపిస్తున్నారు. ఆ మంత్రి ఇచ్చిన జాబితానే అధికారులు ఫైనల్ చేస్తున్నారు.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలి. ఇండ్ల కేటాయింపులో ఇందిరమ్మ కమిటీలు సూచించిన వారికే ఇండ్లను కేటాయించారనే ఆరోపణలున్నాయి. ఇందిరమ్మ కమిటీల్లో కాంగ్రెస్‌కు చెందిన వారే సభ్యులుగా ఉండడంతో అధికంగా వారికే ఇండ్ల మంజూరవుతున్నా యి. అర్హులకు ఇం డ్లు దక్కడంలేదు. దీంతో పేదల సొం తింటి కల కళగానే మిగులనున్నది.
-జానీపాషా