వికారాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారం రెవెన్యూ అధికారులకు తలనొప్పిగా మారింది. ధరణి స్థానంలో భూ భారతి పోర్టల్‌ను తీసుకువచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆప్షన్లు అన్ని భూభారతి పోర్టల్‌లో లేకుండానే భూ సమస్యలను పరిష్కరించాలని రెవెన్యూ యంత్రాంగంపై ఒత్తిడి తీసుకురావడంపై ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆప్షన్లు లేకుండానే దరఖాస్తులన్నింటినీ పరిష్కరించాలని గడువు విధించడం ఏంటని, మేం చేయలేమంటూ రెవెన్యూ అధికారులు చేతులెత్త్తేసినట్లు తెలుస్తున్నది.
రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల్లో అధికంగా ఆర్ఎస్ఆర్(కబ్జాలో ఉన్న భూమి కంటే రికార్డుల్లో విస్తీర్ణం ఎక్కువగా ఉండడం) సమస్యతో కూడిన దరఖాస్తులే అధికంగా వచ్చాయి. అయితే రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల్లో సుమారు 4 వేల వరకు ఆర్ఎస్ఆర్ సమస్యకు సంబంధించిన దరఖాస్తులే రావడం గమనార్హం. మరోవైపు రెవెన్యూ సదస్సులకు ముందే మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవడం, ప్రస్తుతం ఆన్లైన్లో ఒకే సర్వే నెంబర్‌కు సంబంధించి రెండు దరఖాస్తులు ఉండడం, ఏదో ఒక దరఖాస్తును డిలీట్ చేస్తేనే దరఖాస్తు పరిష్కారానికి వీలవుతుంది. ఇందుకుగాను భూభారతిలో సీసీఎల్ఏ నుంచి ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంది కానీ ఆప్షన్లు లేకపోవడంతో తహసీల్దార్లు ఏమి చేయలేకపోతున్నారు. మరోవైపు రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను సిటిజన్ లాగిన్‌లో తహసీల్దార్లు లాగిన్ అయినప్పటికీ భూ సమస్య ఉన్న పట్టాదారు తప్పనిసరిగా ఈ-కేవైసీ చేయాల్సి ఉంటుంది, ఇది చేయాలనే విషయం భూ సమస్య ఉన్న రైతులకు చేరకపోవడంతో కూడా పలు దరఖాస్తులు ఇంకా అడుగు ముందుకు పడలేదు.
గడువు ముగిసినా…పెండింగ్‌లోనే భూ సమస్యలు..
రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించి ప్రభుత్వం విధించిన గడువు ముగిసింది. ధరణి స్థానంలో భూ భారతిని తీసుకువచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నెలరోజుల్లో భూ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని రైతులకు మాయ మాటలు చెప్పి…ప్రస్తుతం రైతులను రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసే పరిస్థితులను తీసుకువచ్చింది. అయితే ఆగస్టు 15లోగా రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పూర్తి చేయాలని అధికారులను ప్రభుత్వం గడువు విధించింది.
అయితే ప్రభుత్వం విధించిన గడువు ముగిసినప్పటికీ దరఖాస్తుల పరిష్కారం మాత్రం అడుగు ముందుకు పడకపోవడం గమనార్హం. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ధరణి పోర్టల్‌పై లేనిపోని ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతిని తీసుకువచ్చి అన్ని ఆప్షన్లు ఇచ్చి భూ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపామని చెప్తున్నా…క్షేత్రస్థాయిలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూ సమస్యలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల సంఖ్య పెరిగిందనే చెబుతున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు దరఖాస్తు చేసుకోవడం, అధికారులు రిజెక్ట్ చేయడం, రైతులు మళ్లీ దరఖాస్తు చేసుకున్న కేసులే అధికంగా ఉన్నాయని రైతులు అభిప్రాయ పడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రైతులను మాయ చేసేందుకు రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసి భూ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపుతామని ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు చెప్పిన దానికి విరుద్ధంగా భూ సమస్యలకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఉండడం గమనార్హం.
గత రెండేళ్లుగా ఒకే భూ సమస్య పరిష్కారం కోసం మూడు, నాలుగు సార్లు దరఖాస్తు చేసుకోవడం, ఏదో కొర్రీ పెట్టి అధికారులు రిజెక్ట్ చేయడంతో చివరకు రెవెన్యూ సదస్సుల్లో కూడా దరఖాస్తు చేసుకున్నారు. అయితే రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల్లో కూడా పరిష్కారం చూపిన దరఖాస్తుల కంటే రిజెక్ట్ అయిన దరఖాస్తులే అధికంగా ఉన్నట్లు తెలుస్తున్నది. రెవెన్యూ సదస్సుల్లో అత్యధికంగా వచ్చిన ఆర్ఎస్ఆర్ దరఖాస్తులకు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడం గమనార్హం. వచ్చే నెలలో లైసెన్స్డ్ సర్వేయర్లతో క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి ఆర్ఎస్ఆర్ సమస్య ఉన్న దరఖాస్తులను పరిష్కరించేందుకు చొరవ చూపుతామని జిల్లా ఉన్నతాధికారులు చెబుతున్నారు.
807 దరఖాస్తులకే మోక్షం…
రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి గడువు ముగిసినప్పటికీ భూ సమస్యల పరిష్కారానికి మాత్రం మోక్షం లభించకపోవడం గమనార్హం. జిల్లావ్యాప్తంగా 475 గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో 11,718 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో కనీసం 10 శాతం దరఖాస్తులను కూడా జిల్లా రెవెన్యూ యంత్రాంగం పరిష్కారం చూపలేకపోయింది. ఇప్పటివరకు కేవలం 807 దరఖాస్తులను మాత్రమే పరిష్కరించారు. మరో 2147 దరఖాస్తులకు సంబంధించి పరిష్కారానికి సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
మరో 700 దరఖాస్తులకు సంబంధించి టెక్నికల్ సమస్య ఉన్నట్లు రెవెన్యూ అధికారులు వెల్లడించారు. వచ్చిన దరఖాస్తుల్లో 11,117 దరఖాస్తులకు సంబంధించి ఆయా మండలాల తహసీల్దార్లు నోటీస్ జనరేట్ చేశారు. రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తు చేసుకొని నెల రోజులు దాటడంతో తహసీల్దార్ కార్యాలయం మొదలుకొని ఆర్డీవో, కలెక్టరేట్ కార్యాలయాలకు భూ సమస్యలున్న రైతులు ప్రదక్షిణలు చేస్తున్నారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులకు సంబంధించి ప్రస్తుతం నోటీస్ జనరేట్ చేసే ప్రక్రియ మినహా అధికారులు చేసిందేమీ లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. రెవెన్యూ సదస్సుల్లో పెట్టిన దరఖాస్తులతో మా భూ సమస్యలు పరిష్కారం అవుతుందనుకున్న రైతులకు మళ్లీ దరఖాస్తు చేసుకోక తప్పదనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.