సిటీ బ్యూరో, మలక్‌పేట, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం అకారణంగా పేదల ఇండ్లను కూలుస్తూ..నివాస హక్కులను కాలరాస్తున్నదని తెలంగాణ బస్తీ జేఏసీ చైర్మన్ గోసుల శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పేదల ఇండ్లను కూల్చి పెద్దలకు కట్టబెట్టేకుట్ర చేస్తున్నదని దుయ్యబట్టారు. చాదర్‌ఘాట్ పరిధిలోని కమలానగర్ బస్తీలో శుక్రవారం మూసీ తీరాన బస్తీ జనయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బస్తీల సమస్యలపై పెద్ద ఎత్తున చైతన్యం తీసుకురావడానికి ‘మూసీ తీరాన బస్తీ జనయాత్ర’ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.
మూసీ పరీవాహకంలోని అన్ని బస్తీల్లో దశల వారీగా కార్యక్రమాన్ని చేపడుతూ ఇండ్లను కాపాడుకునేందుకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ అంటే కేవలం హైటెక్ భవనాలు మాత్రమే కాదని బస్తీల్లో నివసిస్తున్న కష్టజీవులే అసలైన నగర నిర్మాతలని అన్నారు. బస్తీల్లో నివసిస్తున్న ప్రజలకు కనీస జీవన వసతులు, నాణ్యమైన విద్య, పారిశుధ్యం, నివాస భద్రత కల్పించాలనే డిమాండ్‌తో ఈ జన యాత్ర చేపట్టినట్లు తెలిపారు. బస్తీల ప్రజలు ఐక్యంగా ఉంటే సమస్యలకు శాశ్వత పరిషారం సాధ్యమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ యాత్రలో సల్ల శ్రీనివాస్ యాదవ్, చెట్టిపల్లి రాంచందర్, కమలానగర్ బస్తీ చైర్మన్ శ్రీ కాంత్, నాగరాజు, నాగభూషణం, జీహెచ్ఎంసీ బస్తీ మాజీ చైర్మన్, బుర్ర రాముగౌడ్, వైస్ చైర్మన్లు బాలయ్య, అమ్మాజీ, శోభ, నాగరాజు, సాయికుమార్, నవీన్, మహేశ్ బస్తీవాసులు పాలొన్నారు.
ప్రజాభిప్రాయం లేకుండా ఎలా కూలుస్తారు?
కాంగ్రెస్ ప్రభుత్వం బాధిత ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా మూసీ సుందరీకరణ ప్రాజెక్టును ఎలా చేపడతారని బస్తీ జేఏసీ చైర్మన్ గోసుల శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. మూసీ పరీవాహకంలో ఉన్న కాలనీలు, బస్తీల ప్రజలతో ముందుగా చర్చించి వారి అభిప్రాయాలు తీసుకుని ప్రాజెక్టు చేపట్టాలన్నారు. బాధిత ప్రజలకు ముందుగా నివాస భద్రత కల్పించిన తర్వాతనే కూల్చివేతలు, భూసేకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటిదాకా డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు బయటపెట్టకుండా ఇండ్లను కూల్చడం అప్రజాస్వామికమని అన్నారు. డీపీఆర్ బయటపెట్టి దాని ప్రకారమే ముందుకు వెళ్లాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వానికి మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ఎలాంటి స్పష్టత లేకుండా పేద ప్రజల ఇండ్లను కూలుస్తూ వారిని రోడ్డున పడేస్తున్నదని ఆరోపించారు.
బస్తీలకు ప్రభుత్వ ప్రతినిధులు వచ్చి వారితో చర్చించి వారి సమ్మతితోనే సుందరీకరణ పనులు చేయాలని అన్నారు. లేదంటే మూసీ పరీవాహకంలోని అన్ని బస్తీల ప్రజలంతా ఏకమై ప్రభుత్వంపై ఐక్యపోరాటం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ బస్తీ జేఏసీ మూసీ సుందరీకరణకు వ్యతిరేకం కాదని గోసుల శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. కానీ సుందరీకరణ పేరిట పేదల ఇండ్లను కూల్చి నిర్వాసితులను చేయడాన్నే తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. అభివృద్ధి పేరిట పేద ప్రజల ఇండ్లను కూల్చడానికే తాము వ్యతిరేకమని వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్క ఇంటిని కూల్చకుండా నాగోల్ పరిసర ప్రాంతాల్లో సుందరీకరణ పనులు చేపట్టారని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే పేదలు, బస్తీల కష్టజీవులే లక్ష్యంగా పనిచేస్తున్నదని మండిపడ్డారు. ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానంతో పేదలకు ఇబ్బందులు లేకుండా మూసీ సుందరీకరణ పనులు చేయాలని కోరారు. లేదంటే మేధావులు, పర్యావరణ వేత్తలు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీల సహకారంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం తరహాలో మరో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
ఇక్కడి నుంచి కదలబోం
60 ఏండ్ల నుంచి మేం ఇదే బస్తీలో ఉంటున్నాం. ఇప్పుడు ఇండ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని.. మూసీని సుందరీకరిస్తామని అంటున్నారు. మాకు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవిస్తున్నాం. అలాంటప్పుడు ఎలాంటి కారణం లేకుండా వెళ్లిపోవాలంటే ఎక్కడికి వెళ్లాలి? ఎక్కడో డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తారని అక్కడికి పోవాలని అంటున్నారు. మేం ఇక్కడి నుంచి కదలబోం ప్రభుత్వానికి మామీద ప్రేమ ఉంటే ఇక్కడే అన్ని వసతులున్న ఇండ్లు కట్టించి ఇవ్వాలి. మూసీ పేరిట మా ఇండ్లు కూల్చి ఇక్కడ పెద్ద పెద్ద భవనాలు కడతామంటున్నారు. వాటికి వరద రాదా? ప్రభుత్వం ఇప్పటికైనా తమ విధానం మార్చుకుని మా ఇండ్లను కూలుస్తామనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.-నూర్జహాన్, కమలానగర్ బస్తీ
బస్తీలంటే ఎందుకంత చులకన?
హైదరాబాద్‌లోని బస్తీ ప్రజలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకంత చులకన? కనీసం మూసీ ప్రాజెక్టు విధివిధానాలు చెప్పకుండానే ఇక్కడి బస్తీల ఇండ్లను కూల్చారు. అదే బడా బాబులు నివాసముండే ఇండ్లను అలా కూలుస్తారా? బస్తీ వాసులు లేకుండా హైదరాబాద్ నగరం ఎక్కడ ఉన్నది? అసలైన హైదరాబాద్ అంటేనే బస్తీలు. నిత్యం కష్టం చేసుకుని కుటుంబాలను పోషించుకునే పేదలను రోడ్డున పడేయటమేనా ప్రజా పాలన అంటే? మూసీ సుందరీకరణకు మేం వ్యతిరేకం కాదు. కానీ సుందరీకరణ పేరిట బస్తీలను చెరబట్టి పేదలను రోడ్డున పడేస్తామంటే మాత్రం చూస్తూ ఊరుకోం. తెలంగాణ బస్తీ జేఏసీ తరఫున మూసీ పరీవాహకంలోని అన్ని బస్తీల్లో జనయాత్ర చేపడుతాం. అందరం ఏకమై ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం.
-ఇందిర, బస్తీ జేఏసీ వైస్ చైర్మన్