కేశంపేట, మార్చి 14: రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం తొమ్మిదిరేకుల గ్రామంలో వృథాగా పోతున్న మంచినీటి నివారణకోసం సంబంధిత అధికారులు శుక్రవారం మరమ్మతులు చేపట్టారు. ‘నీరు వృధా అవుతున్నా పట్టించుకోరా’ అనే శీర్షికన ఈ నెల 14న ‘నమస్తే తెలంగాణ’ దిన పత్రికలో ప్రచురితమైన కథనానికి మిషన్ భగీరథ ఏఈ నాగమణి వెంటనే స్పందించారు. వెంటనే సంబంధిత అధికారులు, సిబ్బందితో కలిసి మరమ్మతులు నిర్వహించినట్లు ఎంపీడీవో రవిచంద్రకుమార్రెడ్డి తెలిపారు.
నాలుగు రోజుల క్రితం ఓ భారీ వాహనం మిషన్ భగీరథ పైప్లైన్ మీదుగా వెళ్లడంతో పగిలిపోయింది. ఈ విషయాన్ని గ్రామ కార్యదర్శి అవినాశ్ గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారన్నారు. పైప్లైన్ పనులను పూర్తి చేసి గ్రామంలోని ఎస్సీ, బీసీ కాలనీలకు మంచినీటిని సరఫరా చేసేందుకు కృషి చేస్తామని అధికారులు తెలిపారు. సమస్యను వెలుగులోకి తీసుకువచ్చిన ‘నమస్తే తెలంగాణ’కు గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.