ఆత్మస్తైర్యం పెరుగుతుంది…
కరాటే నేర్చుకుంటే ఆత్మస్తైర్యం పెరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు కరాటే నేర్చుకుంటే మంచిది. బాలికల కోసం ప్రత్యేకంగా కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని ఉన్నది. శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తే క్రీడాకారులకు ఉపాధి అవకాశాలు ఏర్పడుతాయి.
– ఖాజా కరీమోద్దిన్, కరాటే మాస్టర్, కొడంగల్
కొడంగల్, మే 18 : ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపిస్తున్నాడు పట్టణానికి చెందిన ఖాజా కరీమొద్దీన్. చిన్ననాటి నుంచే కరాటే శిక్షణ పొంది బ్లాక్ బెల్ట్ సాధించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాడు. పట్టణానికి చెందిన కరాటే మాస్టర్ వెంకటయ్యతో 7వ తరగతిలో ఉన్నప్పుడే కరాటే శిక్షణ తీసుకొన్నాడు. పలువురు పోలీసులకు తన విద్యా నైపుణ్యాన్ని అందించాడు. ఫీజు ఇచ్చినా, ఇవ్వకున్నా చిన్నారులతో పాటు యువతీయువకులకు కరాటే నేర్పిస్తున్నాడు. పలువురు మాస్టర్లు, ఎస్పీ, డీఎస్పీలతో శభాష్ అనిపించుకున్నాడు. దీంతో ఖాజా కరీమొద్దీన్ పేరు కాస్త కరాటే కరీంగా మారింది.
10కి పైగా గోల్డ్ మెడల్స్..
జాతీయ స్థాయి పోటీల్లో దాదాపు 10కి పైగానే గోల్డ్ మెడల్స్ సాధించాడు. చేతి వేళ్లపై నుంచి ద్విచక్ర వాహనం, జీపు వంటి వాహనాలు వెళ్లే ఎన్నో సాహస విన్యాసాలను ప్రదర్శించాడు.
శిక్షణ నుంచి శిక్షకుడిగా..
కరాటే విద్యను పది మందికి నేర్పించాలనే సంకల్పంతో ఆరు ఏండ్లుగా శిక్షణ ఇస్తున్నాడు. ఆయా ప్రాంతాల్లో శిక్షణ అందించాడు. శిక్షణ పొందినవారు బ్లాక్, గోల్డ్ మెడల్స్ సాధించేలా తోడ్పాటును అందిస్తున్నాడు. దాదాపు 500 మందికి పైగా శిక్షణ ఇచ్చానని, అందులో ఇద్దరు మహిళలు బ్లాక్ బెల్ట్, ఐదుగురు గోల్డ్ మెడల్స్ సాధించినట్లు కరీం తెలిపారు. ప్రస్తుతం కస్తూర్బా గాంధీ పాఠశాలలో 200 మంది విద్యార్థినులకు శిక్షణ ఇస్తున్నాడు. 2020 పోలీసు ఉద్యోగాలు సాధించిన 134 మందికి కరాటేలో శిక్షణ అందించి అప్పటి ఎస్పీ నారాయణచే అభినందనలు అందుకున్నాడు.