యాచారం, ఏప్రిల్ 3 : మండలంలోని మేడిపల్లి గ్రామంలో గతంలో సేకరించిన ఫార్మాసిటీ భూముల్లో గురువారం రెవెన్యూ అధికారులు చేపట్టిన రీ సర్వేను రైతులు అడ్డుకున్నారు. కోర్టు స్టే ఉన్న భూముల జోలికి తాము వెళ్లమని చెప్పిన అధికారులు ఆ భూముల్లోనే సర్వే చేపట్టడంతో ఒక్కసారిగా రైతులు తిరగబడడంతో.. గ్రామం లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. అదనపు డీసీపీ వెంకటసత్యనారాయణ, ఏసీపీ రాజు, సీఐ కృష్ణంరాజు సమక్షంలో 200ల పైచిలుకు పోలీసులు గ్రామంలోని ఫార్మా భూముల్లో పాగా వేయగా.. రెవెన్యూ అధికారులు సర్వేను చేపట్టారు.
కోర్టు స్టే ఉన్న భూముల జోలికి వెళ్లమని ముందుగానే ప్రకటించిన అధికారులు గ్రామ శివారులో ఉన్న 67వ సర్వేనంబర్‌లోని భూమిలో సర్వేను ప్రారంభించి పదుల సంఖ్యలో వచ్చిన హిటాచీ, జేసీబీలతో కందకాలు తీసి హద్దురాళ్లను ఏర్పాటు చేస్తుండగా.. ఆ పొలం యజమాని జంగయ్య సర్వేను అడ్డుకున్నాడు. కోర్టు స్టే ఉన్న భూమిలో ఎందుకు సర్వే చేసి హద్దురాళ్లను ఏర్పాటు చేస్తున్నారని పోలీసులతో వాగ్వివాదానికి దిగాడు. కంచె ఏర్పాటు చేయొద్దని అడ్డుకోవడంతో ఏసీపీ రాజు కల్పించుకొని అతడికి నచ్చజెప్పినా ససేమిరా అనడంతో ఠాణాకు తరలించారు.
దీంతో అక్కడికి చేరుకున్న గ్రామస్తులు, రైతులు ఒక్కసారిగా పోలీసులు, అధికారులపైకి తిరగబడ్డారు. గతంలో పరిహారం తీసుకున్న భూముల్లోనే కంచె వేస్తామని చెప్పి కోర్టు స్టే ఉన్న భూముల్లో హద్దురాళ్లను ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. ఫార్మా కోసం భూములు కోల్పోయిన బాధిత రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఎకరాకు 121 గజాల ఇంటి స్థలాన్ని కేటాయిం చి, రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాలని వారు డిమాం డ్ చేశారు. ప్లాట్లు ఇచ్చే వరకు తమ భూముల జోలికి రావొద్దని నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, రమేశ్, గణేశ్, సందీప్‌రెడ్డి, యాదయ్య, జంగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనిపై అధికారులు స్పష్టత ఇవ్వాలని వారు పట్టుబట్టారు. దీంతో ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి రైతులతో మాట్లాడగా.. కోర్టు ఆర్డర్‌ను ఆర్డీవోకు చూపించారు. కోర్టు కేసులున్న భూముల జోలికి వెళ్లొద్దని రైతులు డిమాండ్ చేయడంతో 67వ సర్వేనంబర్‌లో హద్దురాళ్ల ఏర్పాటు ప్రక్రియను ఆర్డీవో ఆదేశంతో అధికారులు నిలిపివేశారు. పది రోజుల్లోగా ప్లాట్ల పంపిణీకి ప్రణాళికను రూపొందిస్తామని ఆర్డీవో రైతులకు వివరించారు. పై అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని అధికారులు రైతులకు సూచించారు.
రైతులకు న్యాయం జరిగేవరకు ఇక్కడ ఎలాంటి పనులు చేపట్టొద్దని బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పాశ్చ బాషా అధికారులు, పోలీసులకు సూచించారు. ఫార్మాకు భూములివ్వని రైతుల పేర్లను ఆన్లైన్లో ఎక్కించాలని, భూములిచ్చిన రైతులకు ప్లాట్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు రైతులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులకు న్యాయం జరిగే వరకు ఇక్కడ ఎలాంటి పనులు చేయొద్దని పనులను అడ్డుకునేందుకు యత్నించిన అతడితో పాటు బీఆర్ఎస్ కార్యకర్త సాయికుమార్‌ను పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లి పోలీస్ వాహనంలో ఎక్కించారు. రైతులు పోలీసుల వాహనానికి అడ్డుపడడంతో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. దీంతో పోలీసులు ఆందోళన కారులను చెదరగొట్టి బీఆర్ఎస్ నాయకులను కందుకూరు పీఎస్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి సర్వేకు సహకరించాలని కోరారు. రైతుల సమస్యలను ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని ఆమె రైతులకు సూచించారు.
భారీ బందోబస్తు
మేడిపల్లి గ్రామంలో నిర్వహించే సర్వేకు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. యాచారం, హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్, మంచాల, ఆదిబట్ల, ఇబ్ర హీంపట్నం, మాడ్గుల, కందుకూరు, బాలాపూర్ పీఎస్‌ల నుంచి డీసీపీ సునీతారెడ్డి పర్యవేక్షణలో అదనపు డీసీపీ ఆధ్వర్యంలో ముగ్గురు ఏసీపీలు, 8 మంది సీఐలు, 15 మంది ఎస్ఐలు, 187 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. పోలీసుల పహారా మధ్య ఇటాచీ, జేసీబీలతో కందకాలు తీసి హద్దులు నాటారు. సర్వే వద్దకు ఎవ్వరూ రాకుండా పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు.
ప్లాటు, ఉద్యోగం ఇవ్వాలి
గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం భూములు కోల్పోయిన రైతు కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. ఇంటికో ఉద్యోగం, ప్లాట్లు ఇచ్చాకే భూ ముల వద్దకు రావాలి. అప్పటి వరకు భూము లను రైతులే సాగు చేసుకుంటారు. నిరుద్యోగ యువతకు ప్రభుత్వం చేయూత అందించాలి. ఉపాధి కూలీలు, వ్యవసాయ కూలీలకు పనులు కల్పించాలి. లేదంటే ప్రభుత్వంపై తిరగబడటం ఖాయం.
-శంకర్, పల్లెచెల్కతండా
స్టే ఉన్న భూముల్లో సర్వే ఎలా చేస్తారు.. ?
బలవంతంగా భూసేకరణ చేయొద్దని హైకోర్టు స్టే ఇచ్చినా పోలీసులు, రెవెన్యూ అధికారులు భూముల సర్వే చేయడం కోర్టు ధిక్కరణ కిందికే వస్తుంది. ఫార్మాసిటీ కోసం భూము లిచ్చిన రైతులకు పునరావాసంతోపాటు ఉపాధి కల్పించాలి. రైతులకు ఎకరానికి 121 గుంటల ఇంటి స్థలాన్ని ఇస్తామని చెప్పి ఇప్పటికీ కేటాయించలేదు. అంతేకాకుండా రైతులకు ఇండ్లస్థలాలు అప్పగించడంతోపాటు ఉపాధి అవకాశాలు కల్పించిన తర్వాతే సర్వే పనులను చేపట్టాలి.
-కే సరస్వతి, ఫార్మా భూవ్యతిరేక పోరాట కమిటీ సభ్యురాలు
భూముల జోలికి రావొద్దు
రైతులెదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేవరకు భూముల జోలికి రావొద్దు. కోర్టు స్టే ఉన్న భూముల వద్దకు రామని చెప్పిన అధికారులు, పోలీసులు స్టే ఉన్న భూము లనే సర్వే చేయడం ఎంత వరకు సమంజసం. ముందు అధికారులు, పోలీసులు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. రైతుల పేర్లను ఆన్లైన్లో ఎక్కించిన తర్వాతే భూముల జోలికి రావాలి. ఫార్మాకు భూములిచ్చిన రైతులకు అధికారులు వెంటనే ప్లాట్లు పంపిణీ చేయాలి. లేదంటే ఆందోళనలు తప్పవు.
– కానమోని గణేశ్, మేడిపల్లి