కొండాపూర్, జూలై 10 : రోడ్డు ప్రమాదంలో ర్యాపిడో బైక్ డ్రైవర్ మృతి చెందిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఖమ్మం జిల్లా కల్లూరు మండలం రాళ్ల బహుజర గ్రామానికి చెందిన గుర్రం వెంకట రామారావు (28), నల్లగండ్లలో నివాసం ఉంటూ ర్యాపిడో బైక్ నడుపుతున్నాడు. గురువారం మధ్యాహ్నం నల్లగండ్ల నుంచి లింగంపల్లి వైపు వెళ్తున్నాడు.
ఫ్లైఓవర్ పైన ఉన్న సిగ్నల్ దగ్గర ఆగి ఉండగా వెనుక నుంచి వేగంగా దూసుకువచ్చిన రెడీమిక్స్ ట్యాంకర్ రామారావు బైక్ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రామారావును దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.