షాబాద్ : ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై దాడి చేసి రెండు తులాల పుస్తెలతాడును ఎత్తుకెళ్లిన సంఘటన షాబాద్ మండలంలోని సర్దార్నగర్ గ్రామంలో చోటు చేసుకుంది. మంగళవారం షాబాద్ సీఐ ఆశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని సర్దార్నగర్ గ్రామానికి చెందిన బండారి నర్సమ్మ మంగళవారం ఉదయం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి వచ్చి ఆమె మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడును లాక్కొవడానికి ప్రయత్నించాడు. తెరుకున్న మహిళ పక్కన ఉన్న ఓ కట్టెతో అతడిని కొట్టింది.
దీంతో ఆ వ్యక్తి మహిళపై దాడి చేసి ఆమె మెడలో ఉన్న పుస్తెలతాడును లాకెళ్లాడు. పుస్తెలతాడు సుమారు 2 తులాలు ఉంటుందని బాధిత మహిళ తెలిపింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.