మొయినాబాద్ : ఉన్నత విద్యార్థుల ఆలోచన విధానం ఉన్నతంగా ఉండాలని, తమ చదువులు సమసమాజ అభివృద్ధి కోసం దోహదపడాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ డాక్టర్ లింబాద్రి అన్నారు. మండల పరిధిలోని చిలుకూరు రెవెన్యూలో ఉన్న అరిస్టాటిల్ పీజీ కళాశాలలో విద్యార్థులు ఎంబీఏ పూర్తి చేసిన సందర్భంగా పట్టభద్రుల దినోత్సవాన్ని శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థులు సాయిప్రియ, మనీషకు గోపాల్‌రెడ్డి మెమోరియల్ తరుపున బంగారు పతకం, నగదును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయ సాధన దిశగా విద్యార్థులు భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవాలన్నారు.
ఉన్నత విద్యను అభ్యసించిన విద్యార్థులు ఉపాధి కల్పన దిశగా ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో అరిస్టాటిల్ విద్యా సమితి చైర్మన్ కృష్ణారెడ్డి, కేజీరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ జహగీర్దార్, అరిస్టాటిల్ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.