షాద్‌నగర్ : జిల్లాలోని స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుల ఎన్నికల నోటిఫికేషన్‌ను జిల్లా కలెక్టర్, ఎన్నికల నిర్వాహన అధికారి అమోయ్‌కుమార్ మంగళవారం విడుదల చేసి వివరాలను వెల్లడించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందని ఈ నెల 23 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. మొదటి రోజు ఒక్క అభ్యర్థి కూడా నామినేషన్ వేయలేదని వివరించారు. నామినేషన్ పత్రాలను పనిదినాల్లో ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు ఎన్నికల నిర్వాహన అధికారికి అందజేయాలని సూచించారు. ఎన్నికల నిర్వాహన అంశాలను ఎప్పటికప్పుడు జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంతో పాటు అన్ని ఆర్డీఓ, తాసిల్దార్, మండల పరిషత్, మున్సిపాలిటీ కార్యాలయాల్లోని నోటిస్ బోర్డులో ప్రదర్శించాలని అధికారులకు సూచించారు.
నామినేషన్ల స్వీకరణ పక్రియ ముగిసిన అనంతరం ఈ నెల 24న నామినేషన్ల పత్రాల పరిశీలన ఉంటుందని చెప్పారు. అదే విధంగా అభ్యర్థులు కానీ, అభ్యర్థిని ప్రతిపాధించిన వ్యక్తులు కానీ ఈ నెల 26 మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ పత్రాలను అందజేయవల్సి ఉంటుందని వివరించారు. డిసెంబర్ 10న ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి సందేహాలు ఉన్న అభ్యర్థులు సంబంధిత అధికారులతో తగిన సలహాలు, సూచనలు తీసుకోవచ్చని చెప్పారు.