షాబాద్ : గ్రామాల్లో హరితహారం నర్సరీల్లో మొక్కల పెంపకం పకడ్బందీగా చేపట్టాలని డీఆర్డివో జిల్లా అదనపు పీడీ నీరజ అన్నారు. బుధవారం షాబాద్ మండల పరిధిలోని సీతారాంపూర్ గ్రామంలో హరితహారం నర్సరీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చే ఏడాది హరితహారం కార్యక్రమానికి నర్సరీల్లో అన్ని రకాల మొక్కలు పెంచాలని సూచించారు. మొక్కలు సక్రమంగా నాటి నీళ్లు పోసేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. పండ్ల జాతి మొక్కలతో పాటు, ఇతర నీడనిచ్చే మొక్కలు పెంచాలన్నారు.
హరితహారం కార్యక్రమంతో గ్రామాలను పచ్చదనంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. పల్లెప్రకృతి వనాల్లో నాటిన మొక్కలతో గ్రామాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడిందని స్పష్టం చేశారు. ఆమె వెంట ఉపాధి హామీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.