తాండూరు, ఆగస్టు 24 : టీఆర్ఎస్ సర్కార్ హయాంలో ప్రభుత్వ దవాఖానల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు ప్రభుత్వ జిల్లా దవాఖానలో బోయింగ్ ఇంటర్నేషనల్ కంపెనీ సహకారంతో రూ.2కోట్లతో సీటీ స్కాన్ సేవలను జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, కలెక్టర్ పౌసుమిబసు, జిల్లా గ్రంథాలయం చైర్మన్ మురళీకృష్ణగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్నతో పాటు బోయింగ్ ఇంటర్నేషనల్ కంపెనీ ప్రతినిధులు కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా దవాఖానలో మరిన్ని మెరుగైన సేవలకు, చికిత్సలకు ప్రత్యేక నిధులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సీఎం కేసీఆర్ పాలనలో విద్య, వైద్యానికి అధిక నిధులు కేటాయించడంతోపాటు దాతలు సహకరించడంతో సర్కార్ దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి చికిత్సలు అందుతున్నాయని తెలిపారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజలకు మెరుగైన చికిత్స అందిస్తున్న వైద్యులను అభినందిస్తూ బోయింగ్ ఇంటర్నేషనల్ కంపెనీ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ డా.మల్లికార్జున్, ఆర్డీవో అశోక్‌కుమార్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దీప, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, తాండూరు ఎంపీపీ అనిత, యాలాల ఎంపీపీ బాలేశ్వర్‌గుప్తా, తాండూరు జడ్పీటీసీ మంజుల, మున్సిపల్ కౌన్సిలర్లు, వైద్యులున్నారు.