మంచాల, సెప్టెంబర్ 18 : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో బీజేపీ పాత్ర ఎక్కడా లేదని, ఆ పోరాటాన్ని మతపరంగా విభజించి చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాల వారోత్సవాల ముగింపు బహిరంగ సభ మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. ముందుగా తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. రైతాంగ సాయుధ పోరాటంలో బీజేపీ పాత్ర శూన్యమని, వాస్తవ చరిత్రను కనుమరుగు చేసేందుకు బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భూమి, భుక్తి, విముక్తి కోసం జరిగిన సాయుధ పోరులో భీమిరెడ్డి నర్సింహారెడ్డి నాయకత్వంలో చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య ముందుండి సాయుధ పోరును నిర్వహించారని గుర్తుచేశారు. నిజాం వ్యతిరేక పోరాటంలో ముస్లింలు కూడా అమరులయ్యారని గుర్తు చేశారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్‌వెస్లీ, జిల్లా కార్యదర్శి భాస్కర్, నాయకులు సామెల్, యాదయ్య, జగదీశ్, రాజు, శ్యాంసుందర్, నర్సింహ, జంగయ్య, శ్రీనివాస్‌రెడ్డి, కందుకూరి జగన్, శ్రీనివాస్ నాయక్, పోచమోని కృష్ణ తదితరులు పాల్గొన్నారు.