కొత్తగా నిర్మిస్తున్న రాష్ట్ర సచివాలయ భవనానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెడుతామని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజా సంఘాల నేతలు సంబురాలు చేసుకున్నారు. పలుచోట్ల సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. -న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ
నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ సచివాలయ భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజా సంఘాల నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటాలతోపాటు అంబేద్కర్ విగ్రహాలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ అంబేద్కర్ అందరివాడని, ఆయన పేరును సచివాలయానికి పెట్టడం మనందరికీ గర్వకారణమని అభిప్రాయపడ్డారు. ‘జై అంబేద్కర్.. జై కేసీఆర్’ అంటూ నినాదాలు చేశారు. ఇది చరిత్రలో నిలిచిపోయే నిర్ణయమని ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో ఢిల్లీలోని కొత్త పార్లమెంట్ భవనానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు.