ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 14: విద్యాభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత నిస్తున్నదని విద్యాశాఖమంత్రి సబితారెడ్డి అన్నారు. బుధవారం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని వినోభానగర్‌లో రూ.2.05కోట్లతో నిర్మించిన కస్తూర్బాగాంధీ జూనియర్ కళాశాల నూతన భవనాన్ని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రెసిడెన్షియల్ పాఠ శాలలు ఏర్పాటుచేసి పేద, మధ్యతరగతి విద్యార్థులకు గుణాత్మకమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు నాలుగు వందల గురుకులాలు మాత్రమే ఉండేవని, రాష్ట్రం ఏర్పడిన తరువాత 1150 జూనియర్ కళాశాలలను రెసిడెన్షియల్ కళాశాలలుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి వరకు ఉన్న కస్తూర్బా పాఠశాలలను 270 జూనియర్ కళాశాలలను అప్‌గ్రేడ్ చేశామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థిపైన రూ.1.20లక్షలను ఖర్చు చేస్తున్నదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 80 డిగ్రీ గురుకుల పాఠశాలలు, 20 పీజీ కళాశాలలు, ఒక మహిళా యూనివర్సిటీ, రెండు లా కళాశాలలు ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. అలాగే, మన ఊరు- మనబడి కార్యక్రమం కింద ప్రతి పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పించటంతో పాటు ఆంగ్లమాధ్యమాన్ని అందుబాటులోకి తీసుకు రావటం వలన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల వైపు పరుగులు తీస్తున్నారన్నారు. ఒకేరోజు రంగారెడ్డిజిల్లాలో 2 కస్తూర్బా జూనియర్ కళాశాలల నూతన భవనాలను ప్రారంభించుకోవటం ఎంతో శుభపరిణామమన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో నాణ్యమైన విద్యనందిస్తుండటం వలన ఈ కళాశాలలు, పాఠశాలల్లో సీట్లకోసం విద్యార్థుల తల్లిదండ్రులు క్యూ కడుతున్నారన్నారు. ప్రభుత్వ గురుకుల, కస్తూర్బా పాఠశాలల్లో ఎలాంటి సమస్యలు తలెత్తినా సంబంధిత ఎమ్మెల్యేల దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇబ్రహీంపట్నం కస్తూర్బా గురుకుల పాఠశాలలో ఒకరోజు నీటిసౌకర్యం లేక ఇబ్బందులకు గురైన విషయంపై వెంటనే స్పందించి ప్రభుత్వం అన్ని రకాల వసతులు కల్పించిందని గుర్తుచేశారు. అందులో భాగంగానే నూతన భవనాన్ని కూడా ప్రారంభించుకున్నామన్నారు. విద్యార్థులను ఉపాధ్యాయులు తమ బిడ్డలుగా భావించి వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి మంచి విద్యను, నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఆమె ఆదేశించారు.
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభు త్వం గురుకుల పాఠశాలల్లో మరిన్ని సౌకర్యాలు కల్పించటం కోసం సిద్ధంగా ఉందని, త్వరలోనే ఇబ్రహీంపట్నం కస్తూర్బా పాఠశాలకు ప్రహరీ నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేష్, మున్సిపల్ ఛైర్పర్సన్ కప్పరి స్రవంతి, మార్కెట్ కమిటి మాజీ ఛైర్మన్ సత్తు వెంక టరమణారెడ్డి, వైస్ చైర్మన్ యాదగిరి, సర్పంచ్‌లఫోరం జిల్లా అధ్యక్షుడు బూడిద రాంరెడ్డి, కౌన్సిలర్లు సుజాత, సుధాకర్, జగన్, మంగ, పద్మ, మమత, జ్యోతి, శ్రీలత, శ్వేత, ప్రసన్న, బాలరాజు, టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, మండల అధ్యక్షుడు బుగ్గరాములు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్, ఆర్డీవో వెంకటాచారి, తహసీల్దార్ రామ్మోహన్రావు, ఎంపీడీవో జైరాంవిజయ్, నాయకులు రాజు, విజయ్, రాజ్‌కుమార్, వీరేశ్ పాల్గొన్నారు.