రంగారెడ్డి, సెప్టెంబర్ 10, (నమస్తే తెలంగాణ) :దేశ స్థితిగతులపై అపారమైన అవగాహన కలిగిన సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి చక్రం తిప్పాలని ఉమ్మడి జిల్లా ప్రజలు ముక్తకంఠంతో పేర్కొంటున్నారు.. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశ ప్రజలందరికీ అందించే సత్తా ఉన్న ఏకైక నేత కేసీఆర్ అని.. ఆయన దేశ రాజకీయాల్లో వేసే ప్రతి అడుగు.. దేశానికి వెలుగులు పంచనుందని ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ప్రజలకు పెద్దగా ఒరిగిందేమీ లేదని, కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నేతతోనే ప్రజలకు మేలు కలుగుతుందంటున్నారు. బీజేపీ పాలనలో ప్రజలకు తీరని అన్యాయం జరుగుతున్నదని, కాషాయ నేతల కుట్రలను తిప్పి కొట్టగల చతురత ఉన్న కేసీఆర్.. దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించి తెలంగాణ మాదిరిగా దేశాన్ని బంగారు భారత్‌గా మార్చాలని కోరుకుంటున్నారు.
దేశం మెచ్చిన నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి సమరశంఖం మోగించేందుకు ముహూర్తం ఖరారైంది. జాతీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉన్నది. దేశ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ ఎంట్రీపై తెలంగాణే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు, పార్టీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా పార్టీని స్థాపించి, ఎన్నో పోరాటాలు, ఒడిదుడుకులను ఎదుర్కొని ముందుకు సాగి అప్పటి కేంద్రం దిగివచ్చేలా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రత్యేక తెలంగాణను సాధించారు. సాధించిన తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి తీసుకొచ్చి యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచారు. రైతులు, దళితులు, మహిళలు తదితర అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా వృద్ధి చెందేందుకు సీఎం కేసీఆర్ ఆర్థిక చేయూతతోపాటు వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తుండగా, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మాత్రం కేవలం దేశ సంపదను అదానీ వంటి ఒకరిద్దరికి దోచిపెడుతూ దేశానికి నష్టం చేకూరుస్తున్నది.
విభజన చట్టంలోని అంశాలను పట్టించుకోకుండా, సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వకుండా, అప్పు సేకరణలో ఆటంకం ఇలా అడుగడుగునా మోదీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి అడ్డుతగులుతూ విషం కక్కుతున్నది. ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను తమ గుప్పిట్లో పెట్టుకొని ప్రశ్నించే రాష్ర్టాలు, ప్రతిపక్ష నేతలపై ఉసిగొల్పుతున్నది. దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకుపోవడం దేవుడెరుగు దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా బీజేపీ వ్యవహరిస్తున్నది. తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీతోపాటు వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తుండగా, సీఎం కేసీఆర్ రైతుల మేలు కోరి చేస్తున్న ఉచిత విద్యుత్తు సరఫరాను నిలిపివేసి రైతుల నోట్లో మట్టి కొట్టేలా మీటర్లు పెట్టాలని చూస్తున్నది.
వీటన్నింటిని తిప్పి కొట్టి దేశంలోనే నంబర్ వన్‌గా దూసుకుపోతున్న తెలంగాణ మాదిరిగా దేశాన్ని అభివృద్ధి చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. మరోవైపు జాతీయ స్థాయిలో పార్టీని ప్రకటించిన వెంటనే సర్వత్రా అంగరంగ వైభవంగా స్వాగతోత్సవాలు నిర్వహించేందుకు టీఆర్ఎస్ యంత్రాంగంతోపాటు అన్ని వర్గాల ప్రజలు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని సంబ్బండ వర్ణాలవారు దేశ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ వెళ్లాలని కోరుకుంటున్నారు. ఇటీవల జిల్లా సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జాతీయ రాజకీయాల్లోకి వెళ్లమంటారా అని సీఎం అడుగగా, ముక్తకంఠంతో జిల్లా ప్రజానీకం జైకొట్టడం గమనార్హం.
సీఎం కేసీఆర్‌కు అన్ని వర్గాల మద్దతు
దేశ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ అడుగు పెట్టాలని అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. కేంద్రంలోని బీజేపీ కార్పొరేట్ల కొమ్ము కాస్తూ పేద ప్రజల ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తున్నది. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను తెగ నమ్ముతూ బడా పారిశ్రామిక వేత్తలను మరింత కుబేరులుగా మార్చుతున్నది. అధికారం కోసం బీజేపీ నాయకత్వం అడ్డదారులు తొక్కుతున్నది. రాష్ట్రం ఆవిర్భవించిన తొలి రోజుల్లో కరెంటు కోతలు, లో ఓల్టేజీ సమస్యతో అంధకారంలో ఉన్న తెలంగాణ… ఏడాదిన్నర కాలంలోనే వ్యవసాయానికి ఉచిత కరెంట్, ఇతర రంగాలకు నాణ్యమైన కరెంటును అందిస్తున్నది. మిషన్ భగీరథ వంటి పథకంతో వందల కి.మీ పైప్లైన్లు వేసి ఇంటింటికీ తాగునీటిని అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కింది.
రైతుబంధు, రైతుబీమా పథకాలతో అన్నదాతలకు కొండంత ధైర్యమొచ్చింది. పేదింటి ఆడబిడ్డల పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌తో రూ.1,00,116 అందిస్తున్నది. విద్యారంగం అభివృద్ధికి గురుకులాల ఏర్పాటు, సన్నబియ్యంతో విద్యార్థులకు భోజనం, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, ఇతరులకు ఆసరా పింఛన్లను అందిస్తున్న ఘనత కేసీఆర్‌దే. 2024లో బీజేపీయేతర ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని, వ్యవసాయానికి దేశమంతా ఉచిత కరెంటు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో అన్ని వర్గాల్లో చర్చకు దారి తీసింది. దేశంలోని వనరులను ఎలా సద్వినియోగం చేసుకోవాలో సీఎం కేసీఆర్‌కు పూర్తి అవగాహన ఉన్నది. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టాలని అన్ని వర్గాలు స్వాగతిస్తుండడం గమనార్హం.
తెలంగాణ మాదిరిగానే దేశం అభివృద్ధి చెందుతది. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నది. కేసీఆర్ వంటి విజన్ ఉన్న నాయకుడు కావాలని దేశ ప్రజలు కోరుకుంటుండ్రు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను దేశంలో అమలు చేస్తే రైతుల ఆత్మహత్యలు ఉండవు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలు పేదలకు ఉపయోగపడుతాయి. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో దేశం అభివృద్ధి చెందుతది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నది.
– గోవర్ధన్‌రెడ్డి, శంకర్పల్లి ఎంపీపీ