తుర్కయాంజాల్, సెప్టెంబర్ 8 : వినాయక నిమజ్జనానికి తుర్కయాంజాల్ మాసబ్ చెరువు వద్ద ఏర్పా ట్లు పూర్తయ్యాయి. నగరం నుంచే కాక మున్సిపాలిటీ నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి ఏర్పాట్లను పకడ్బందీగా చేశారు. రెండు క్రేన్లను ఏర్పాటు చేయడంతో పాటు భక్తులకు అత్యవసర సమయంలో ఉపయోగపడే విధంగా హెల్త్ సెంటర్ను కూడా ఏర్పాటు చేశారు. మాసబ్ చెరువు పూర్తి స్థాయి నీటితో నిండి ఉండటంతో భక్తులు చెరువులోకి దిగకుండా మున్సిపల్ సిబ్బందే వినాయక ప్రతిమలను నిమజ్జనం చేయనున్నారు. శుక్రవారం సామూహిక నిమజ్జన కార్యక్రమం ఉండటంతో ఇబ్బందులు తలెత్తకుండా నిమజ్జన ఏర్పాట్లను చేశారు.
ప్రశాంతంగా జరుపుకోవాలి
ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం డివిజన్లో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న వినాయక నిమజ్జనాలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమామహేశ్వర్రావు కోరారు. ఈ మేరకు ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ..ప్రశాంత వాతావరణంలో గతవారం రోజులుగా భక్తిశ్రద్ధ్దలతో పూజలు నిర్వహించారని, నిమజ్జనాన్ని కూడా ప్రశాంతంగా జరుపుకోవాలని ఆయన సూచించారు. ఇబ్రహీంపట్నం ప్రాంత వినాయకులను తట్టిఖానాలో నిమజ్జనం చేసుకోవటం కోసం అన్ని ఏర్పాట్లు చేశామని, క్రేన్ సౌకర్యం కూడా కల్పించామని తెలిపారు.
ఉదయం పూటనే నిమజ్జనాలు జరుపుకోవాలని, రాత్రి సమయాల్లో ప్రమాదాలు జరిగే అవకాశముందని చెప్పారు. శేరిగూడ పరిసర ప్రాంతాల్లోని వినాయకుల ప్రతిమలను శేరిగూడ సమీపంలోని చెక్డ్యాంలల్లో నిమజ్జనం చేసుకోవటం కోసం ప్రత్యేక క్రేన్ సౌకర్యాన్ని కూడా కల్పించినట్లు తెలిపారు. మాసబ్ చెరువు వద్ద కూడా ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. డీజేలకు అనుమతులు లేనందున డీజేలను ఉపయోగించి ఇతరులకు ఇబ్బందులు కలించకుండా నిమజ్జనాలు చేసుకోవాలని ఆయన కోరారు. నిమజ్జనాల సందర్భంగా నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.