రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి
షాబాద్, మార్చి 14: పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు. సోమవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లపై మెడికల్ సూపరింటెండెంట్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజేంద్రనగర్ కమ్యూనిటీ దవాఖానలో డెలివరీలు ఎక్కువగా అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. సాధ్యమైనంతవరకు సాధారణ డెలివరీలు జరిగేలా చూడాలన్నారు. మళ్లీ వచ్చే మీటింగ్‌లో పురోగతి ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ దవాఖానల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారన్నారు. ప్రభుత్వ వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండి పేదలకు సేవలు అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ దవాఖానలకు వచ్చే ప్రతి రోగికి చికిత్స అందించాలని, వైద్యులు సమయానికి విధులకు రావాలని చెప్పారు. కొండాపూర్ దవాఖానలో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయన్నారు. ఈ సౌకర్యాలపై ప్రజలకు అవగాహన కల్పించి సద్వినియోగం చేసుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సదరం క్యాంపులు మంగళవారం రోజు కొండాపూర్, శుక్రవారం రోజు వనస్థలిపురంలో జరుగుతున్నాయన్నారు. రోగులకు వైద్యపరీక్షలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని దవాఖానల్లో సరిపడా మందులు అందుబాటులో ఉన్నట్లు వివరించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో దిలీప్‌కుమార్, డీసీహెచ్ఎస్ కో-ఆర్డినేటర్ డాక్టర్ ఝాన్సీ, కొండాపూర్ జిల్లా దవాఖాన, చేవెళ్ల, వనస్థలిపురం, హయత్‌నగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్ దవాఖానల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.