పరిగి, సెప్టెంబర్ 8 : తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తుండగా.. ప్రతి పేద కుటుంబంలోని వారికి ఆసరాగా నిలుస్తున్నాయి. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని సంక్షేమ సర్కారు పాలనలో ఒకే ఇంట్లో ముగ్గురికి కొత్తగా పింఛన్లు మంజూరయ్యాయి. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కంకల్ గ్రామానికి చెందిన మేడిపల్లి నర్సమ్మ భర్త చనిపోవడంతో కొత్తగా మంజూరు చేయబడిన పింఛన్లలో ఆమెకు ఆసరా పింఛన్ మంజూరైంది. నర్సమ్మ కూతురు 12 ఏండ్ల నిహారిక, కుమారుడు పదేండ్ల నితీష్ పుట్టుకతోనే మానసిక దివ్యాంగులు. దీంతో వారికి దివ్యాంగుల పింఛన్ మంజూరైంది. ఈ మేరకు గురువారం కంకల్ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో నర్సమ్మతోపాటు పిల్లలు నిహారిక, నితీష్లకు పింఛన్ మంజూరు పత్రాలను పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అందజేశారు.
దళిత కుటుంబానికి చెందిన నర్సమ్మకు ముగ్గురు సంతానం కాగా.. ఇద్దరు మానసిక దివ్యాంగులు. వారి బాగోగులు చూసుకుంటూ ఇంటి దగ్గరే ఉండే నర్సమ్మ కుటుంబానికి మూడు పింఛన్ల మంజూరు చేసి సర్కారు తోడ్పాటు అందిస్తున్నది. కొత్తగా మంజూరైన పింఛన్లతో నర్సమ్మకు నెలకు రూ.2016, నిహారిక, నితీష్లకు రూ.3016 చొప్పున డబ్బులు అందనున్నాయి. ఒకే కుటుంబంలో ఒకేసారి ముగ్గురికి పింఛన్లు ఇవ్వడంతో మాకు బతుకుపై ఆశ కలిగిందని నర్సమ్మ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ మంచోడు.. అందుకే మాకు పింఛన్లు ఇచ్చారని ఆమె తెలిపారు. ఇదిలావుండగా నర్సమ్మ భర్త మేడిపల్లి నర్సింహులు 2018 సెప్టెంబర్ 26న గుండెపోటుతో చనిపోవడంతో అప్పట్లో రైతు బీమా కింద రూ.5లక్షలు అందాయి. నర్సింహులు తండ్రి చిన్న రాములుకు ఇప్పటికే పింఛన్ వస్తున్నది. దీంతో ఒక కుటుంబానికి పూర్తిస్థాయిలో ఆసరా కల్పించి ఆ కుటుంబానికి సర్కారు అండగా నిలబడిందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు.