గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో అన్నదాన కార్యక్రమాలకు ప్రత్యేక స్థానం ఏర్పడింది. దాదాపు వినాయక ప్రతిమ ప్రతిష్ఠించిన ప్రతిచోటా అన్నదానం తప్పనిసరయింది. కాలనీ, గేటెడ్ కమ్యూనిటీ, గల్లీ, ఊరు ఇలా అక్కడ జనాభా సంఖ్యకు అనుగుణంగా భారీగానే అన్నదానం కోసం ఉత్సవ కమిటీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. గణపతి ప్రతిమలను మూడ్రోజులు లేదా ఐదు రోజులకే నిమజ్జనం చేయాలని నిర్ణయించినా ఆలోపే అన్నదానాలు ఏర్పాటుచేస్తారు. పలు కాలనీల్లో ఉత్సవ కమిటీలు ఇంటింటికీ వెళ్లి ఆహ్వానం పలికాయి. మరికొన్నిచోట్ల తలా కొంత వేసుకుని అన్నదానం చేస్తారు.
విందు భోజనాలు
నోరూరించే హల్వా, జిలేబీ, భక్ష్యాలు ఒకవైపు.. చింతపండుతో చేసిన పులిహోర మరోవైపు. ఔరా అనిపించేలా వంకాయ మసాలా ఇంకో స్పెషల్. ఇక వెజ్ బిర్యానీ, పాలకూర పప్పు, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, సాంబార్, పెరుగు, టమాట, దోసకాయ చట్నీలు, పాపడాలు.. ఇదీ వినాయక మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాల్లో కనిపిస్తున్న మెనూ. వంటల విషయంలో ఉత్సవ కమిటీలు ఎక్కడా తగ్గడంలేదు. ఓ గల్లీకి మించి ‘వంటలు బాగున్నాయి’ అని అనిపించుకునేందుకు ఉత్సాహపడుతున్నాయి. అందుకు తగ్గట్టు భారీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. చిన్న చిన్న గల్లీల్లో 100 నుంచి 200 మందికి భోజనాలు వడ్డించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. గ్రామాలు, పెద్ద వినాయక మండపాల వద్ద కనీసం 600 నుంచి 1000 మంది భోజనాలు చేసేందుకు వీలుగా వంటలు తయారు చేయిస్తున్నాయి. భక్తులకు కడుపునిండా వడ్డించేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. తమ గణపతి మండపం గురించి ప్రత్యేకంగా చర్చించుకునేలా వసతులు కల్పిస్తున్నాయి.
కాలనీల్లో కలిసికట్టుగా..
పలు కాలనీలు, గల్లీల్లోని కుటుంబాలు అన్నదానం కోసం తలాకొంత సహకారం అందిస్తున్నాయి. ఓ నలుగురు బియ్యం వేస్తే.. మరికొందరు వంట సామగ్రికి నగదు అందజేస్తున్నారు. ఇంకొందరు సిలిండర్లు, పప్పు, చింతపండు ఇలా వస్తువులు అందజేస్తున్నారు. కొన్నిచోట్ల కాలనీల మహిళలంతా ఒక్కచోటకు చేరి స్వయంగా భోజనాలు తయారుచేస్తున్నారు. కొన్ని కాలనీ అసోసియేషన్లు నేరుగా అన్నదానం సైతం క్యాటరింగ్కు ఇచ్చేస్తున్నాయి. ఒక్కో భోజనానికి రూ.120 నుంచి 250 వరకు వెచ్చిస్తున్నాయి.
ముందుకొస్తున్న దాతలు
అన్ని దానాల్లో అన్నదానం మిన్న అంటారు చాలామంది. అందుకే నలుగురి ఆకలితీర్చేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. ఉత్సవ కమిటీలు చందాల కోసం వెళ్తుంటే.. అన్నదానం చేస్తామంటూ హామీ ఇస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే వందల మందికి సరిపడేలా భోజనాలు తయారుచేయిస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వయంగా భక్తులకు వడ్డిస్తూ మానవసేవే మాధవసేవ అని తరిస్తున్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని వివరిస్తూ.. వృథా చేయొద్దని సూచిస్తున్నారు.